Kamalapur Belt Shops Ban
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలక మండలి బెల్ట్ షాపులకు చెక్ పెట్టింది. శనివారం గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గ్రామాభివృద్ధి, ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…. బెల్ట్ షాపుల్లో రాత్రి పగలు తేడా లేకుండా ,విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాల వల్ల గ్రామంలో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని,యువత తాగి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యంపై అధిక ధరలు వసూలు చేస్తూ పేద కుటుంబాలపై పెను భారం మోపుతున్నారని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అబ్కారీ శాఖ అధికారులు స్పందించి, కమలాపూర్ పాలక మండలి తీసుకున్న ఈ తీర్మానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలోనే తాగునీరు, పారిశుధ్యం వంటి అభివృద్ధి పనులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
