Konda Surekha Congress Action
* ఇవాళే తుది నిర్ణయం
* కొండా సురేఖపై వేటు తప్పదా ?
* కాంగ్రెస్ హైకమాండ్ సంచలన ఆదేశాలు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, క్రమశిక్షణా రాహిత్యంపై అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఎఐసిసి సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ పంపిన నివేదికలు చేరగా, ఆయన గురువారం మరోసారి వీటిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలతో పాటు, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన తీరుపై టీపీసీసీ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మంత్రినైనా, సీనియర్ నేతలైనా క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పిన రాష్ట్ర నాయకత్వం.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని హైకమాండ్ వద్ద పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో అధిష్టానం ముందస్తు చర్యలు చేపట్టింది.
* ష్.. గమ్మునుండండీ..
ఈ ఎపిసోడ్‌పై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులెవరూ మీడియా ముందు, సోషల్ మీడియాలో గానీ స్పందించవద్దని ఆదేశించింది. పార్టీ తుది నిర్ణయం ప్రకటించే వరకు అందరూ మౌనంగా ఉండాలని హైకమాండ్ స్పష్టమైన సూచనలు జారీ చేసింది. సురేఖపై వేటు వేస్తే ఉత్పన్నమయ్యే రాజకీయ పరిణామాలను, వర్గ సమీకరణాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ నాయకత్వం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈ వ్యవహారంలో నేడు ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
