Warangal CP N Swetha
* లైంగిక దాడుల బాధితులకు సకాలంలో న్యాయం అందించడంలో అన్ని
* శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
అకేరు న్యూస్ హనుమకొండ:
లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలను సకాలంలో అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతి దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు, మానసిక పరామర్శ, న్యాయ సహాయం ఒకే వేదికపై అందేలా భరోసా కేంద్రం ద్వారా సమర్థవంతమైన సేవలు కొనసాగించాలని సీపీ తెలిపారు.
