CURE Act 2026
నేటి నుంచి CURE యాక్ట్ అమల్లోకి
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర పాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ (CURE) యాక్ట్–2026 నేటి నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. 70 ఏళ్లుగా అమల్లో ఉన్న GHMC యాక్ట్–1955 స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తోంది. అక్టోబర్ 2న గెజిట్ నోటిఫికేషన్ జారీతో చట్టం అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
మూడు కార్పొరేషన్లకు ఒకే విధానం
ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌ను కొత్త చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు.
ఇక మూడు కార్పొరేషన్ల పరిధిలో పాలన, మౌలిక వసతుల అభివృద్ధి, పౌర సేవల విషయంలో సమన్వయంతో కూడిన విధానం అమలు కానుంది. ఇందుకోసం CURE Apex Governance Council, Executive Committee వంటి వ్యవస్థలను చట్టం ప్రతిపాదిస్తోంది.
ప్రాపర్టీ ట్యాక్స్‌లోనూ మార్పులు
CURE యాక్ట్‌లో భాగంగా ఆస్తిపన్ను విధానంలో కూడా కీలక మార్పు రానుంది. ప్రస్తుతం ఉన్న Annual Rental Value (ARV) విధానానికి బదులుగా Capital Value System (CVS) అమలు చేయనున్నారు. కొత్తగా నిర్మించిన, ఇంకా పన్ను అంచనా వేయని ఆస్తులకు ఈ విధానం వెంటనే వర్తించనుండగా.. ఇప్పటికే ఉన్న ఆస్తులకు 2027–28 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. మార్పు సమయంలో ఆస్తిపన్ను పెరుగుదలను ఏడాదికి గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేశారు.
ORR వరకు సమగ్ర పట్టణ పాలన
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ORR లోపల ఉన్న ప్రాంతాలకు ఒకే విధమైన పట్టణ ప్రణాళిక, రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వరదల నిర్వహణ వంటి అంశాలను సమన్వయంతో అమలు చేయడమే CURE చట్టం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
అనధికార నిర్మాణాల నియంత్రణ, చెరువులు– నాలాల పరిరక్షణ, రోడ్లు–యుటిలిటీల సమన్వయం, స్టార్మ్ వాటర్ మేనేజ్మెంట్, పర్యావరణం, ట్రాఫిక్, విపత్తుల నిర్వహణ వంటి అంశాలకు కూడా కొత్త చట్టంలో ప్రాధాన్యం ఇచ్చారు. సింగిల్ విండో డిజిటల్ పోర్టల్, కామన్ బిల్లింగ్ వ్యవస్థలను కూడా తీసుకురానున్నారు.
అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం
సెప్టెంబర్ 12న తెలంగాణ అసెంబ్లీ CURE బిల్లును ఆమోదించింది. అనంతరం గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టానికి అక్టోబర్ 2 నుంచి అధికారికంగా అమలు ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
70 ఏళ్ల తర్వాత భారీ మార్పు..
GHMC యాక్ట్–1955కు ముగింపు పలుకుతూ CURE యాక్ట్–2026 నేటి నుంచి అమల్లోకి రావడం రాష్ట్ర పట్టణ పాలనలో కీలక పరిణామంగా నిలవనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
