DCP Kavitha, Warangal Inter State Thief Arrest
* అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
* వరంగల్‌లో వరుస చోరీలకు చెక్..
* రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం
అకేరు న్యూస్, వరంగల్: తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి.. రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* పగటిపూట రెక్కీ.. రాత్రివేళ చోరీలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుస దొంగతనాలు జరగడంతో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27) ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితుడు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పగటిపూట ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించి, రాత్రివేళల్లో ఆ ఇళ్లలోకి చొరబడి నగలు, నగదు తదితర విలువైన వస్తువులను అపహరించేవాడని పోలీసులు తెలిపారు.
* మహారాష్ట్రలోనూ ఇదే తరహా నేరాలు
నిందితుడిపై గతంలో మహారాష్ట్రలోనూ చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. 2024, 2025 సంవత్సరాల్లో నాలుగు చోరీలకు పాల్పడిన నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైనప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.
తాజాగా వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఎస్ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
* పోలీసులకు కమిషనర్ అభినందనలు
అంతర్రాష్ట్ర నిందితుడిని పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ స్వామి, ఎస్ఐ మహేష్, ఏఏఓ సల్మాన్ పాషాతో పాటు సీసీఎస్, మిల్స్ కాలనీ పోలీస్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పట్టుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. తాళం వేసి ఇళ్లను విడిచి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
