Krishna Water Sharing Telangana AP
* హైదరాబాద్‌లో కేఆర్ ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం
* నీటి పంపకాలపై ఎటూ తేల్చని వైనం
* మరోసారి సెప్టెంబరు 4న భేటీ కావాలని నిర్ణయం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ ఏర్పడింది. నీటి పంపకాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే నీటి పంపకాలు ఎటూ తేల్చకుండానే సమావేశం మరోసారి వాయిదా పడింది.
* సెప్టెంబర్ 4కు వాయిదా
హైదరాబాద్ లో జరిగిన కేఆర్ ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ ఏడాది నీటి పంపకాలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడం ఆసక్తిగా మారింది. మళ్లీ సెప్టెంబరు 4న భేటీ కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఈ భేటీకి తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు, ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. కానీ నీటి వాటాలపై ఎటూ తేల్చకుండానే సమవేశాన్ని ముగించారు.
* ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మాట్లాడుతూ..
సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో దృష్ట్యా నదీ జలాలను కేవలం తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 50:50 నిష్పత్రిపై ఇంకా తేలలేదని, నీటి పంపకాలు ఎలా చేయాలో మరిన్ని సిట్టింగ్ ల తర్వాత నిర్ణయించాలని సమావేశంలో చర్చించినట్లు నరసింహమూర్తి తెలిపారు. ఎవరికి ఎంత నిష్పత్తి అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. పోతిరెడ్డి పాడు 22 టీఎంసీలు, హెచ్ఎన్ ఎస్ సిస్టం నుంచి 11 టీఎంసీలు, ఎన్ఎస్పీ నుంచి 8 టీఎంసీలు, కేడీఎస్ నుంచి 6 టీఎంసీలు వాడడానికి తెలంగాణ వాళ్లు ముందు ఒప్పుకున్నారని, వాళ్లకు ఎంత అనే అంశానికి వచ్చేసరికి బ్రేకప్ అయిందని వివరించారు. అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్న పోతిరెడ్డి పాడు నుంచి 22 టీసీలు వాడుకునేందుకు 31 అక్టోబర్ వరకు ఒప్పుకున్నట్లు తెలిపారు.
* అసలు నీటి వివాదం ఏంటి
2014లో రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలిక ఏర్పాటుగా కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 TMCలు (71%), తెలంగాణకు 299 TMCలు (29%) కేటాయించారు. 299 టీఎంసీల కేటాయింపు అనేది కేవలం ఒక ఏడాది కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందమని, తమ రాష్ట్రంలో కృష్ణా నది బేసిన్ (ఆయకట్టు ప్రాంతం) ఎక్కువగా ఉన్నందున 50:50 నిష్పత్తిలో (లేదా కనీసం 50% వాటా) నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు పాత నిష్పత్తి ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని ఏపీ కోరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ వైపు, నాగార్జునసాగర్ ఆంధ్రప్రదేశ్ వైపు ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొలిక్కి రావడం లేదు. కేఈఆర్ఎంబీపరిధిలోకి వాటిని తీసుకురావడంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ నీటి వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 కి తెలంగాణ వాదనలను పరిశీలించే బాధ్యతను అప్పగించింది. ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల అవసరాలు, బేసిన్ పరిధిని బట్టి తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
