* కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు
* మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ని (Sanjay) చేర్చుకున్నప్పటి నుంచీ గుర్రుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి (Jeevan Reddy) అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. 40 ఏళ్ల సీనియార్టీకి కనీస గౌరవం ఇవ్వకుండా, మాటైనా చెప్పకుండా సంజయ్‌ను చేర్చుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని నియమాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇతర ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటుందని మండిపడుతున్నారు. కనీస గౌరవం లేని ఎమ్మెల్సీ పదవి తనకెందుకు అంటూ ఓ దశలో రాజీనామాకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి. ఈమేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu) తదితరులు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ జీవన్‌రెడ్డి అసంతృప్తిని వీడలేదు. ఈనేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రమ్మని పిలిచినట్లు తెలిసింది. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్యణ్ను ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) నుంచి కబురువచ్చింది. ఈనేపథ్యంలో వారు ఢిల్లీకి పయనమైనట్లు తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీవన్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
———————–