
లోక్‌సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక
* ఎన్డీఏ కూటమి నుంచి రెండో సారి..
* మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటన
* ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్
ఆకేరు న్యూస్ డెస్క్ : లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా (Om Birla) రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి కె. సురేష్‌పై (K Suresh) ఆయన స్పీకర్‌గా విజయం సాధించారు. ఉత్కంఠగా మొదలైన స్పీకర్ ఎన్నికలో మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. మూడోరోజు బుధవారం ప్రారంభమైన లోక్‌సభ సమావేశాల్లో స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశం పెట్టారు. రాజనాథ్ సహా పలువురు ఎంపీలు ఆయనను బలపరిచారు. విపక్ష కూటమి అభ్యర్థిగా కె.సురేష్‌ను శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించారు. ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు బలపరిచారు. అనంతరం ఎన్నిక ప్రారంభమైంది. మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. 48 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభ దేశ జనవాణిని వినిపించాలని, సభ సజావుగా సాగేందుకు విపక్షం సంపూర్ణంగా సహకరిస్తుందని రాహుల్ ప్రకటించారు.
ఓం బిర్లా ప్రస్థానం
ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2014, 2019, 2024లలో వరుసగా మూడుసార్లు గెలుపొందారు. అంతకు ముందు 2003 నుంచి 2014 వరకు కోటా సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2024లో, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన తర్వాత, దిగువ సభకు తిరిగి ఎంపీగా ఎన్నికైన 20 ఏళ్లలో మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అలాగే.. రెండుసార్లు స్పీకర్‌గా నియమితులైన ఇద్దరు ఎంపీలలో ఓం బిర్లా రెండోవారు. రామమందిర ఉద్యమంలో జైలుకెళ్లి వచ్చారు. రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఆయనకు ఎంపీలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
—————-