Dongaa Naa Koduku Movie Heroine Sushmitha Shetty
* ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు – సుష్మితా శెట్టి
* మౌళితో నటించడం మంచి అనుభవం..
* * డ్యాన్స్, నటనపై ఆసక్తికర విషయాలు పంచుకున్న హీరోయిన్
ఆకేరు న్యూస్, సినిమా : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’లో హీరోయిన్గా నటిస్తున్న సుష్మితా శెట్టి తన పాత్ర, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తాను క్యూట్ అండ్ బబ్లీగా ఉండే పాత్రలో కనిపిస్తానని తెలిపారు. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తుండగా, శ్రీను కంబాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
* శ్రీదేవి స్ఫూర్తితో నటన వైపు..
తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని సుష్మితా శెట్టి తెలిపారు. తన తాతయ్య, అమ్మమ్మ 40 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చారని చెప్పారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై ఆసక్తి ఉండేదని, అన్ని రకాల డ్యాన్స్‌లు నేర్చుకున్నానని వివరించారు. డ్యాన్స్‌లో భావాలను వ్యక్తపరచాల్సి రావడంతో నటనపై ఆసక్తి పెరిగిందన్నారు. విదేశాల్లో చదువుకునే సమయంలో థియేటర్ కూడా చేశానని తెలిపారు.

‘దొంగ నా కొడుకు’ తనకు లీడ్ హీరోయిన్గా తొలి సినిమా అని చెప్పారు. గతంలో ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్‌లో నటించానని, ఇప్పుడు వెండితెరపై తనను తాను చూసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు.
* ఈశ్వర్‌ను ప్రేమించే అమాయకమైన అమ్మాయి పాత్ర
ఈ సినిమాలో తన పాత్ర చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంటుందని సుష్మితా చెప్పారు. కొంచెం తింగరిగా ఉండే ఈ పాత్ర ఈశ్వర్ (మౌళి)ని ప్రేమిస్తుందని, అతడి ప్రేమ కోసం ఏదైనా చేస్తుందని వివరించారు. తాను చాలా తెలివైనదాన్నని అనుకునే పాత్ర అయినప్పటికీ, ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకున్నప్పుడు అది కామెడీగా మారుతుందని నవ్వుతూ చెప్పారు. తెలియకుండానే అమాయకంగా క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవుతుందని, తన పాత్రలో ఇన్నోసెంట్ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలిపారు.
* మైత్రీ మూవీ మేకర్స్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది
మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని సుష్మితా అన్నారు. భారీ స్టార్ సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న కథలను కూడా ఈ సంస్థ ప్రోత్సహించడం ఆనందంగా ఉందని చెప్పారు. హీరో మౌళి చాలా ప్రతిభావంతుడని, ఎంతో హంబుల్‌గా ఉంటారని ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
* డ్యాన్స్‌కు కూడా ప్రాధాన్యత
‘దొంగ నా కొడుకు’లో ఒక డ్యాన్స్ నంబర్ ఉందని, అది ప్రేక్షకులను అలరిస్తుందని సుష్మితా చెప్పారు. మౌళికి మరో సోలో పాట కూడా ఉందని తెలిపారు. భవిష్యత్తులో మంచి డ్యాన్స్ సాంగ్స్ ద్వారా తన ప్రతిభను నిరూపించుకోవాలని ఉందన్నారు. టాలీవుడ్లో తనకు ఇష్టమైన డ్యాన్సింగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని వెల్లడించారు. సంగీత దర్శకుడు సింజిత్ చాలా ప్రతిభావంతుడని, క్రైమ్ కామెడీ కథకు తగినట్లుగా అద్భుతమైన సంగీతాన్ని అందించారని ప్రశంసించారు.
* ‘మహానటి’ లాంటి పాత్ర చేయాలనుంది
తనకు ‘మహానటి’ సినిమా చాలా ఇష్టమని సుష్మితా తెలిపారు. అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని, అలాంటి విభిన్న భావాలు పలికించే పాత్రలో నటించాలని ఉందన్నారు. అలాగే స్పోర్ట్స్ సినిమాలు, రొమాంటిక్ కామెడీలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలపైనా ఆసక్తి ఉందన్నారు. దర్శకుడు శ్రీను కంబాల తన తొలి సినిమా అయినప్పటికీ ఎంతో ప్రశాంతంగా పనిచేశారని సుష్మితా చెప్పారు. షూటింగ్ సమయంలో ఆయన ముఖంలో ఎప్పుడూ టెన్షన్ కనిపించలేదని, చాలా కూల్‌గా ఉండేవారని వివరించారు.
* నవ్వుకుంటూ బయటకు వస్తారు
‘దొంగ నా కొడుకు’ చూసిన ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తారని సుష్మితా అన్నారు. ఇందులో ఫ్రెష్ కామెడీ, వినోదభరితమైన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘దొంగ నా కొడుకు’ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

