Doctor Qasim Suicide Case
ఆకేరు న్యూస్, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక రికవర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఖాసిం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆయన విష ఇంజక్షన్ తీసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
* యాజమాన్యం వేధింపులే కారణమా..
డాక్టర్ ఖాసిం ఆత్మహత్యకు ఆస్పత్రి యాజమాన్యం చేసిన మానసిక వేధింపులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్లతో పాటు, యాజమాన్యం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేకే ఆయన ఈ దారుణ నిర్ణయానికి పాల్పడ్డారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
* అనుమానాలకు తావిస్తున్న యాజమాన్యం తీరు..
ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ఖాసిం ఆత్మహత్య చేసుకున్న విషయం బయటకు పొక్కకముందే.. యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనను దాచడానికే యాజమాన్యం ఇంత తొందరపడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* రంగంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. డాక్టర్ ఖాసిం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రస్తుతం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
