* రోడ్డెక్కిన కుటుంబ గొడవలు
* గరం గరంగా భార్యాభర్తల మధ్య వార్
* ఎమ్మెల్సీ ఇంటి ముందు భార్య, కుమార్తె ధర్నా
* మా హక్కులు మాక్కావాలంటూ ఆందోళన
* 30 ఏళ్లుగా ఆమె టార్చర్ భరిస్తున్నా..
* ఈ రచ్చ వెనుక అచ్చెన్నాయుడు : దువ్వాడ శ్రీను
* డబ్బు కోసం ఆమె అలా చేస్తోంది : శ్రీను తల్లి
* నా పేరు అనవసరంగా బయటకు లాగుతున్నారు : మాధురి
ఆకేరు న్యూస్, విజయనగరం : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వార్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజులుగా దువ్వాడ శ్రీను, వాణిల మధ్య వార్ నడుస్తోంది. ఇప్పుడు ఈ గొడవలపై శ్రీనివాస్ తల్లి లీలావతి కూడా స్పందించారు. ఆ ఫ్యామిలీ గొడవలో నన్ను అనవసరంగా బయటకు లాగుతున్నారని ఓ మహిళ మాధురి కూడా తెరపైకి వచ్చారు. అసలు ఆ ఫ్యామిలో ఏం జరిగింది.. గొడవలకు కారణాలేంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి మధ్య చాలా రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టికెట్ విషయమై వారి మధ్య రచ్చ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా.. శ్రీనివాస్ వ్యవహారశైలిపై ఆయన భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె డాక్టర్ హైందవి ఆందోళన మొదలుపెట్టారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన మొదలుపెట్టారు.
అర్దరాత్రి ఇంటి వద్ద హైడ్రామా..
గురువారం రోజున అర్ధరాత్రి వరకూ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చి, ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన భర్త వివాహేతర సంబంధం కారణంగా తమ కుటుంబం పరువు పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదని, తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని వాణి కోరారు. హైందవి మాట్లాడుతూ.. తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వెల్లడించారు. శనివారం కూడా దువ్వాడ ఫ్యామిలీ వార్ కొనసాగింది.
ఆమెకు డబ్బు పిచ్చి.. రాజకీయ పిచ్చి.. : శ్రీనివాస్ తల్లి
దువ్వాడ శ్రీనివాస్, వాణి పరస్పర ఆరోపణలపై శ్రీనివాస్ తల్లి లీలావతి కూడా స్పందించారు. తన కొడుకు దువ్వాడ శ్రీనివాస్‌ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని లీలావతి ఆరోపించారు. వాణికి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పట్నుంచో చెబుతున్నానని తెలిపారు. ప్రేమ వివాహం కాబట్టి వాణితోనే శ్రీను కొనసాగాడని చెప్పారు. కానీ తన మనమరాళ్లు కూడా శ్రీనును తిట్టడం చూస్తుంటే బాధ కలుగుతోందని వాపోయారు. దువ్వాడ శ్రీను ఉంటున్న ఇల్లు తన చిన్న కొడుకు శ్రీధర్ కట్టించాడని తెలిపారు. ఆ ఇంటితో శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వాణికి చెందదని అన్నారు.
*నా భార్యకు రాజకీయ కాంక్ష ఎక్కువ
తన భార్య వాణికి రాజకీయ కాంక్ష ఎక్కువ అని దువ్వాడ శ్రీను తెలిపారు. దీనివల్లే తమ మధ్య అంతర్గత విబేధాలు తలెత్తాయని చెప్పారు. గత రెండేళ్లుగా ఈ విబేధాలు తీవ్రమయ్యాయని.. ప్రతి రోజు ఏదో ఓ గొడవ జరిగేదని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు కావాలని టార్చర్ చేసేదని బయటపెట్టారు. ఆమె టార్చర్ పడలేక గతంలో తన కారులో మూడు రోజులు పడుకున్నానని బయటపెట్టారు. తండ్రిగా తన కూతుళ్లకు అంతా మంచే చేశానని స్పష్టం చేశారు. మాధురి అనే మహిళ తనను ట్రాప్ చేయడానికి తానేం చిన్న పిల్లాడిని కాదని అన్నారు. మాధురికి నేను ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదని.. మాధురినే ఎన్నికలప్పుడు తన కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. ఇప్పుడు నా దగ్గర నయాపైసా లేదు. కాబట్టి నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా రాంగ్ అని కొట్టిపారేశారు. ఈ రచ్చ వెనుక టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారని దువ్వాడ శ్రీను ఆరోపించారు.
దువ్వాడ ఇంటి ముందు భార్య, కుమార్తె ఆగ్రహం
దువ్వాడ శ్రీనివాస్, అతడి తల్లి లీలావతి ఆరోపణల నేపథ్యంలో వాణి తీవ్రంగా స్పందించారు. టెక్కలిలోని దువ్వాడ శ్రీను ఇంటి ముందు బైఠాయించారు. 80 ఏళ్ల ముసలావిడ మాట్లాడాల్సిన మాటలేనా? అదొక తల్లా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. నీచంగా మాట్లాడడం సబబేనా అని ప్రశ్నించారు. ఏం ఆస్తులు రాశాడో.. పత్రాలు చూపించాలని, మేం ఎవరితో మందులు తాగామో ఆమె చెప్పాలని డిమండ్ చేశారు. దువ్వాడ శ్రీనును జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టెక్కలిలోని దువ్వాడ ఇంటివద్ద కుమార్తెతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భైఠాయించారు.
* శ్రీనివాస్‌తో నాది హెల్తీ రిలేషన్షిప్ : మాధురి
భర్తను, అత్తను తీవ్రస్థాయిలో దుర్భాలషలాడుతున్న వాణికి కనీస మర్యాద కూడా తెలియదని దివ్వె మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అనవసరంగా ఈ గొడవలోకి లాగి రోడ్డుపైకి తెచ్చారని అన్నారు. వాస్తవానికి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే వాణి అని, తనకు మహిళల సపోర్టు, అభిమానం ఎక్కువగా ఉండడంతో పార్టీలోకి రావాలని అన్నారు. జిల్లా మహిళ అధ్యక్షరాలి పదవి ఇవ్వాలని కోరానన్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉండేదానినని, గడపగడపకు కార్యక్రమంలో దువ్వాడతో కలిసి పాల్గొన్నట్లు చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్‌ను తాను ట్రాప్ చేయలేదని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తననే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి రాజకీయంగా తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు. భగవద్గీత పట్టుకుని శ్రీను తల్లి లీలావతి అబద్దాలు చెబుతారా .. అని ప్రశ్నించారు. శ్రీనివాస్‌తో నాది హెల్తీ రిలేషన్షిప్ అని, ఆ రిలేషన్ షిప్ ఏర్పడడానికి కూడా వాణియే కారణమన్నారు. ఆమె చేష్టలు, తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
——————————–