* అమ్మా, నాన్న ,కొడుకు ఆత్మహత్య
*ఆర్థిక ఇబ్బందులే ప్రాణాలు తీశాయా?
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ లో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.. కష్టమొస్తే ఒకరికొకరు తోడుండాల్సిన ఆ కుటుంబం, మృత్యువులోనూ తోడుండాలని నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది.. హోటల్ వ్యాపారంలో ఎదురైన ఒడిదుడుకులు, అప్పుల ఊబి..ముగ్గురు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. తెల్లవారుజామున లోకమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ.. రామరాజు (55) తన స్నేహితుడు రవికి ఒక వాట్సాప్ మెసేజ్ పంపారు. ఆ సందేశమే ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆఖరిదయింది. ఉదయం తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి చూసిన స్థానికులకు విగతజీవులుగా పడి ఉన్న ఆ కుటుంబ సభ్యులు కనిపించారు. రామరాజు(55) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య. మాధవి (50) బెడ్‌పై విగతజీవిగా పడి ఉంది. శశాంక్ (24) మణికట్టు కోసుకుని, అనంతరం ఉరివేసుకుని అత్యంత బాధాకరమైన స్థితిలో కనిపించాడు. మృతుడు రామరాజు అంబర్‌పేటలో సుపరిచితుడు. స్థానికంగా పాపులర్ అయిన ‘ల్యాండ్ మార్క్ హోటల్’తో పాటు మరో ప్రాంతంలో బిర్యానీ పాయింట్‌ను కూడా నడుపుతున్నారు. బయటకి అంతా సజావుగానే ఉన్నట్లు కనిపించినా, లోపల ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని లోలోపల తొలిచేస్తున్నాయని తెలుస్తోంది . గత కొంతకాలంగా వ్యాపారంలో వస్తున్న నష్టాలు, పెరుగుతున్న వడ్డీల భారం వారిని ఈ కఠిన నిర్ణయం వైపు పురికొల్పాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
డీసీఫీ దక్షిణ మూర్తి మాట్లాడుతూ “ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలే ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాం.”అని అన్నారు.
*వరస ఆత్మహత్యలు:* నగరవాసుల్లో ఆందోళన
ఇటీవలే ఘట్కేసర్ ప్రాంతంలో తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే, ఇప్పుడు అంబర్‌పేట్‌లో ఇలా ఒకే కుటుంబం బలవ్వడం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మధ్యతరగతి మరియు వ్యాపార వర్గాల్లో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడికి ఇవి అద్దం పడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు చావు ఒక్కటే సమాధానం కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం, ఆత్మీయులతో సమస్యను పంచుకోవడం ఎంతో అవసరం. రామరాజు కుటుంబానికి ఒక కుమార్తె కూడా ఉంది. నేడు ఆమె ఒంటరిదై, తీరని శోకంలో మునిగిపోయింది.
————–
