Medak gas shortage crisis
* తెల్లవారుజామున 4 గంటలకే కిలోమీటర్ మేర క్యూ
* గ్యాస్ ఆటోపై జనం దాడి.. ఖాళీ సిలిండర్లు ఇవ్వకుండానే 40 మాయం
* కిలోమీటర్ మేర క్యూ.. 40 సిలిండర్లు మాయం
ఆకేరు న్యూస్, సంగారెడ్డి:
ఉమ్మడి మెదక్ జిల్లాలో వంట గ్యాస్ కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా వినియోగదారులు అల్లాడిపోతున్నారు. గ్యాస్ బుక్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ కాకపోవడంతో, జనం రోడ్లపైకి వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా మెదక్ జిల్లా శివంపేట, సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలాల్లో చోటుచేసుకున్న సంఘటనలు గ్యాస్ కష్టాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
* దొంతిలో అరాచకం: ఖాళీ సిలిండర్లు ఇవ్వకుండానే 40 మాయం!
మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో ఆటో గ్రామానికి చేరుకోగానే, సమాచారం అందుకున్న గ్రామస్థులు ఒక్కసారిగా దానిపై ఎగబడ్డారు. డెలివరీ బాయ్ నిబంధనల ప్రకారం సీరియల్ లో ఇస్తానని మొత్తుకుంటున్నా వినకుండా.. వినియోగదారులు బలవంతంగా ఆటో ఎక్కి సిలిండర్లను దించేసుకున్నారు. సుమారు 40 మంది వినియోగదారులు తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను డెలివరీ బాయ్‌కు అప్పగించకుండానే, కొత్త సిలిండర్లను తీసుకుని వెళ్లిపోయారు. చేసేదేమీ లేక సదరు డెలివరీ బాయ్ లబోదిబోమంటూ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
* గోంగ్లూర్‌లో తెల్లవారుజాము నుంచే పడిగాపులు..
మరోవైపు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూర్ గ్రామంలో గ్యాస్ ఏజెన్సీ వద్ద పరిస్థితి యుద్ధాన్ని తలపిస్తోంది. గ్యాస్ స్టాక్ వస్తుందన్న సమాచారంతో వినియోగదారులు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఏజెన్సీ కార్యాలయం వద్ద బారులు తీరారు. సూర్యోదయానికల్లా ఆ క్యూ లైన్ సుమారు ఒక కిలోమీటర్ మేర పెరిగిపోయింది. “గ్యాస్ బుక్ చేసి వారాలు గడుస్తున్నా రావడం లేదు. పనులన్నీ మానుకుని ఇలా రోడ్లపై పడిగాపులు కాయాల్సి వస్తోంది” అని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* అధికారులు స్పందించకుంటే ఉద్యమం తప్పదు!
గ్యాస్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో సరఫరా చేయకపోవడం వల్ల సామాన్యులు అధిక ధరలకు బ్లాక్‌లో కొనాల్సి వస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా పౌరసరఫరాల అధికారులు రంగంలోకి దిగి, గ్యాస్ సరఫరాను తక్షణమే క్రమబద్ధీకరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
