Rajaiah Telangana Water Allegations
* టిఆర్ఎస్, కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే రాజయ్య ధ్వజం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
అవగాహన రాహిత్యం, ఇగోలతో తెలంగాణను ఎండబెడుతుండ్లు, ఆంధ్రాను నీటితో నింపుతుండని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ధ్వజమెత్తారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కరువు మేఘాలు కమ్ముకొని రైతులు ఆందోళన చెందుతుంటే అటు ముఖ్యమంత్రి, ఇటు ఎమ్మెల్యే ప్రజల్ని మభ్య పెట్టే ప్రకటనలు చేస్తున్నారని రాజయ్య దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి టిడిపి హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన మతిభ్రమించి కారుకూతలు కూస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీహరి పై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం, తెలంగాణకు వరప్రదాయని, మానస పుత్రిక… అని ఆనాడు మాట్లాడి…ఇప్పుడు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటావా ? అని రాజయ్య ప్రశ్నించారు.
డ్యామ్ సేఫ్టీ మాత్రమే మేము చూసుకుంటాము…నీటిని లిఫ్ట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అని ఎన్ డి ఎస్ ఏ చెప్పిన ప్రకారం కాళేశ్వరం నుండి 240 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చు కానీ అవగాహన రాహిత్యం, అహంకారంతో రేవంత్ రెడ్డి తెలంగాణను ఎండబెడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు నీటిని దోచిపెడుతుండని రాజయ్య ధ్వజమెత్తారు.
కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చూపెట్టి కేసీఆర్ కు చెడ్డ పేరు తేవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్ డి ఎస్ ఏ కు ఇప్పుడు లేఖ రాయడం విడ్డూరం అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో కరువు వచ్చింది… కడియం వల్ల నియోజక వర్గంలో కరువు వచ్చిందని ఆరోపించారు. ఆయన దేవాదుల సృష్టికర్త కాదు వినాశక కర్త అని కడియం పై ఫైర్ అయ్యారు. తిన్నంటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కడియం, కడియం కు భిక్షాటన చేయడం ఇష్టం పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు తీసుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
* మలేషియా లో తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల చిట్టా నా వద్ద ఉంది..
నేను నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. 10 ఏళ్లలో కుంటలు, చెరువులు నింపుకున్న చరిత్ర టిఆర్ఎస్ ది అయితే ఎండబెడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. నేను చేసిన పనులపై, నువ్వు చేసిన పనులపై చర్చకు సిద్ధమని స్టేషన్ ఘనపూర్ అంబేద్కర్ వద్ద కు రావాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్ కు వెళితే అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేని స్టేషన్ ఘన్ పూర్ కు వస్తే కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న నిన్ను ఎప్పటికైనా సుప్రీం కోర్టు సస్పెండ్ చేస్తుందంటూ జోష్యం చెప్పారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్ పొన్న రాజేష్, మాచర్ల గణేష్, కర్ర సోమిరెడ్డి, రాజన్ బాబు, కనకం గణేష్, చిట్టిబాబు, గుండె మల్లేష్, చల్ల చందర్ రెడ్డి, కుమారస్వామి, పావని, లకావత్ చిరంజీవి, గుండె రంజిత్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
