
* రిమోట్ నొక్కగానే ఎలక్ట్రానిక్ తూకంలో అసలు కంటే 10 కేజీల తగ్గుదల.
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో శుక్రవారం రోజు ఉదయం పత్తిని ఎక్కువ ధరకు కొంటామని ఇద్దరు వ్యక్తులు తూకంలో మోసాలకు పాల్పడి రైతులను దగా చేశారు. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం అంబాల గ్రామానికి చెందిన గుండ్ర రాజకుమార్, పంగిడిపల్లి గ్రామానికి చెందిన సానబోయిన అశోక్ అనే ఇద్దరు ట్రాలీ ఆటోలో ఈ రోజు ఉదయం వంగపల్లి గ్రామంలో రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేస్తున్నారు. పత్తిని ఎలక్ట్రానిక్ కాంటాతో తూకం వేస్తున్నప్పుడు గ్రామస్తులు పత్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తి జేబులో ఉన్న రిమోట్ నొక్కటంతో అసలు బరువు కంటే 10 కిలోలు తక్కువ రావటం గమనించారని సీ.ఐ. తెలిపారు. జరిగిన మోసం పట్ల కొలిపాక కుమారస్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ను పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణ పరిశీలించి అసలు 40 కేజీల పత్తి బస్తాలో 10 కిలోల వ్యత్యాసాన్ని, అసలు 90 కేజీల బరువు ఉన్న పత్తి బస్తాలో 30 కిలోల వ్యత్యాసాన్ని గుర్తించి పత్తిని కొనుగోలు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న కొలతలు తూనికలు శాఖ ఇన్స్పెక్టర్ శ్రీలత ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ను తనిఖీ చేసి మిషన్ ను సీజ్ చేశారు.
అనధికార వ్యక్తులకు పత్తిని అమ్మవద్దు
– పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ
మార్కెటింగ్ శాఖ వద్ద లైసెన్స్లు తీసుకున్న వ్యాపారులు మాత్రమే రైతుల వద్ద ధాన్యం, పత్తి కొనుగోలు చేయాలని పత్తి ధర తక్కువగా ఉన్న సమయంలో గ్రామాల్లో దళారులు తిరుగుతూ తాము ఎక్కువ ధర పెట్టి ధాన్యం, పత్తిని కొంటామని చెబుతూ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారునీ కాబట్టి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తిని, ధాన్యాన్ని అమ్ముకోవద్దని రైతులను అప్రమత్తంగా ఉండాలన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
