స్నేహితుడి కుటుంబానికి సాయం
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: ఆపదలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు 2008–2009 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ స్నేహితుడి కుటుంబానికి రూ.1,20,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన కత్తి శివ శ్రీ సాయి కుమార్ దసరా పండుగ రోజున అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మరణంతో భార్య, రెండేళ్ల చిన్నారి కుమార్తె, తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి దూరం కావడంతో వారు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు.
ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన శివ శ్రీ సాయి కుమార్ స్నేహితులు తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 2008–2009 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన స్నేహితులందరూ కలిసి నిధులు సమీకరించి రూ.1,20,000 ఆర్థిక సాయాన్ని అందించారు. గురువారం నిర్వహించిన దశదిన కర్మ సందర్భంగా బాధిత కుటుంబానికి ఈ మొత్తాన్ని అందజేసి, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కష్టకాలంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థుల మానవత్వంపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆకుతోట సంపత్, మేకల రాజు, పెరబోయిన భాను, బానోత్ నూతన్ నాయక్, పిన్నోజు చారి, జారిపోతుల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

