Gandi Ramaram Lift Irrigation Project Kadiyam Srihari
* అధికారులకు ఎమ్మెల్యే కడియం ఆదేశం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : పంపు హౌస్ నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి శివారు గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ -1 పంపు హౌస్ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ఏతైన ప్రాంతలైన వేలేరు, చిల్పూర్ మండలలకు సాగు నీరు అందించాలని 104 కోట్లతో గండి రామారం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ ఎత్తిపోతల పథకంలో 3 లిఫ్ట్ లు ఉన్నాయని అందులో గత పాలకులు లిఫ్ట్ -2 పనులను మాత్రం పూర్తి చేసుకొని స్వంత భూములకు నీళ్లు తెచ్చుకున్నారని విమర్శించారు. చిల్పూర్, వేలేరు రెండు మండలాల రైతులకు ఉపయోగపడే లిఫ్ట్-1, 3లను మాత్రం పట్టించుకోలేదని తెలిపారు.
నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నత్తనడకన నడుస్తున్న లిఫ్ట్ -1 పనులను అధికారులు, కాంట్రాక్టర్ల వెంట పడి పనులు చేయిస్తున్నానని అన్నారు. లిఫ్ట్ -1పనులు ఇప్పటికి 70 శాతం పూర్తి అయ్యాయని. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసి రెండో పంటకు రైతులకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
పంపు హౌస్ వద్ద ఏ పనులు ఎవరు చేయాలో, పంపు హౌస్ వద్ద సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తారో లేదో అనే విషయాలు అధికారులకే స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. శాఖ మధ్య సమన్వయ లోపంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పనుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని రోజులలో పంపు హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఏమైన సమస్యలు ఉంటే అధికారులు సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు.
అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గారిదే అని అన్నారు. నెల రోజులలోపు పంపు హౌస్ సివిల్, మోటార్లు, ఎలక్ట్రీకల్, మెకానికల్ పనులన్నింటిని పూర్తి చేయాలని అలాగే నవంబర్ చివరి నాటికి పైపు లైన్ పనులను చేయాలని తెలిపారు.
*రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు
డిసెంబర్ లో ట్రయల్ రన్ చేసి జనవరిలో రైతుల రెండో పంటకు ఎట్టిపరిస్థితుల్లో సాగు నీరు అందించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 2002లో దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
ఆనాడు నేను నాటిన చిన్న మొక్క నేడు మహా వృక్షంగా ఎదిగి వేలాది ఎకరాలకు సాగు నీరు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఒకప్పుడు నియోజకవర్గంలో సాగు నీరు లేక పచ్చదనం కనిపించేది కాదని నేడు దేవాదుల ప్రాజెక్టు ద్వారా మండలానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని సమృద్ధిగా సాగు నీరు అందడంతో నియోజకవర్గం అంతటా పచ్చదనం పరుచుకుందని వెల్లడించారు.
నియోజకవర్గం మండలానికి ఒక రిజర్వాయర్ ఉండి కూడా ఇంకా కొన్ని ప్రాంతాలకు సాగు అందించలేకపోవడం బాధాకరంగా ఉంటుందని అన్నారు. గండి రామారం లిఫ్ట్ -1 సాగు నీరు అందని గ్రామాలకు గౌరవెల్లి వరద కాలువ ద్వారా అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
త్వరలోనే గౌరవెల్లి రిజర్వాయర్ పరిధి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇప్పుడు నాపై విమర్శలు చేస్తూ దేవాదుల గురించి మాట్లాడే నీచ నాయకులే ఆ రోజు దేవాదులతో ఏమవుతుంది అని పిండ ప్రధానలు చేశారని విమర్శించారు.
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని వారుకూడా విమర్శలు చేసే వారిని ఏమనాలో అర్థం కాదని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించాలన్నదే నా ఆలోచన అని పేర్కొన్నారు.
*అధికారులకు కడియం కీలక ఆదేశాలు..
దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల అత్యంత ఎక్కువగా లాభపడేది నియోజకవర్గం మాత్రమే అని తెలిపారు. కావున రైతుల కోసం చేసే కాలువలు, పైప్ లైన్, విద్యుత్ పోల్స్ పనులకు రైతులతో పాటు రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సిఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, రెండు మండలాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
