Ganesh Immersion
* గణేశ్ నిమజ్జనాల్లో తీన్మార్ బ్యాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గణేశ్ నిమజ్జన వేడుకల్లో బ్యాండ్ మేళాల సందడి నెలకొంది. డీజేలకు ప్రత్యామ్నాయంగా తీన్మార్ బ్యాండ్ బృందాలు హోరెత్తిస్తున్నాయి. డప్పుల చప్పుళ్లు, వాయిద్యాల మోతకు యువత తీన్మార్ స్టెప్పులతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను మండప నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపాలను అందంగా అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిమజ్జన ఊరేగింపులో బ్యాండ్, బాజా, డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల నుంచి బృందాలు
గణేశ్ నిమజ్జనాల కోసం మండప నిర్వాహకులు కర్ణాటక, గుల్బర్గా, మహారాష్ట్ర, ముంబై తదితర ప్రాంతాల నుంచి బ్యాండ్ బృందాలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా ఐదు నుంచి 11 మంది సభ్యులతో కూడిన బృందాలు నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొంటున్నాయి. ఒక్కో నిమజ్జన కార్యక్రమానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
తీన్మార్ స్టెప్పులతో సందడి
పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడిని బ్యాండ్ మేళాల మధ్య ఘనంగా ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలిస్తున్నారు. కాలనీలు, ప్రధాన రహదారులపై బ్యాండ్ మేళాల చప్పుళ్లు, ఈలలు, డ్యాన్స్‌లతో సందడి నెలకొంటోంది. డప్పుల వాయిద్యాలకు అనుగుణంగా యువత తీన్మార్ స్టెప్పులతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు.
జీవనోపాధిగా ఉత్సవాలు
ఏడాది పొడవునా సరైన ఆర్డర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొనే బ్యాండ్ కళాకారులకు గణేశ్ ఉత్సవాలు మంచి ఉపాధి కల్పిస్తున్నాయి. నిమజ్జనాల సీజన్లో వరుసగా కార్యక్రమాలు లభించడంతో కళాకారులు బిజీగా మారుతున్నారు.
ఐక్యతకు ప్రతీకగా నిమజ్జనం
గణేశ్ నిమజ్జనంలో బ్యాండ్ మేళాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భక్తులు చెబుతున్నారు. కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన సాయినిలయం వాసుల ప్రకారం.. బ్యాండ్ లేకుండా నిమజ్జన వేడుక పూర్తి అయిన భావన కలగదని, ఉత్సాహభరితమైన పాటలకు యువత స్టెప్పులు వేయడం వేడుకకు మరింత జోష్ తెస్తుందని అంటున్నారు. నిమజ్జన వేడుకల్లో కులమతాలకు అతీతంగా యువత, మహిళలు కలిసి పాల్గొని ఆనందంగా గడపడం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
