Government Teacher Gautami Resigns Alleging Harassment
* టీచర్ గౌతమి సంచలన రాజీనామా
ఆకేరు న్యూస్, ఖమ్మం: అధికారుల నిర్దాక్షిణ్య ప్రవర్తన, తోటి ఉపాధ్యాయుల మానసిక వేధింపులు, సోషల్ మీడియాలో నిరంతరం ఎదురవుతున్న ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన డ్యూటీకి గుడ్‌బై చెప్పారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం (ఖానాపురం హవేలీ) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమి రాథోడ్ (Gautami) తన రాజీనామా లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
* సస్పెన్షన్ వేదన.. అవమానాల పర్వం..
గతంలో సోషల్ మీడియా రీల్స్ వ్యవహారంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల ప్రమోషన్‌కు సంబంధించిన ఆరోపణలతో గౌతమి దాదాపు ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరేందుకు నాటి జిల్లా విద్యాశాఖాధికారిణి (DEO) కార్యాలయానికి ఎన్నోసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని ఆమె వాపోయారు. అధికారులు తనను కనీసం మనిషిలా కూడా చూడలేదని, “ఛీ.. దూరం జరుగు, దగ్గరికి వస్తే బాగుండదు” అంటూ తీవ్రంగా అవమానించారని కన్నీటిపర్యంతమయ్యారు.
ఇటీవలే నూతన డిఈఓ గౌతమిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ, తోటి టీచర్లు మరియు సంఘాల నుండి వేధింపులు తగ్గకపోవడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
* ‘బడిలో రీల్స్ చేయలేదు.. నా ఆనందం కోసమే ఇంట్లో చేసుకున్నా’..
తనపై వచ్చిన ఆరోపణలపై గౌతమి వివరణ ఇస్తూ.. పాఠశాల వేళల్లో గానీ, తరగతి గదుల్లో గానీ తాను ఎప్పుడూ సెల్‌ఫోన్ వాడలేదని, అసలు రీల్స్ చేయలేదని తెలిపారు. కేవలం వ్యక్తిగత సమయాల్లో తన ఇంట్లోనే రీల్స్ చేసుకున్నానని చెప్పారు. ఒకవేళ తాను బడిలో రీల్స్ చేసి ఉంటే హెచ్ఎమ్ లేదా విద్యార్థులే ఫిర్యాదు చేసేవారు కదా అని ప్రశ్నించారు.
* గౌతమి ఆవేదన..
“ఒక పేద, గిరిజన కుటుంబం నుంచి వచ్చి, నా భర్త సహకారంతో ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం సాధించాను. పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలన్నదే నా లక్ష్యం. తెలియక చేసిన చిన్న తప్పుకు ఆరు నెలల శిక్ష అనుభవించాను. కానీ పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకుని, నన్ను మాత్రం నిరంతరం నరకానికి గురిచేశారు. నిత్యం అవమానాల మధ్య ఉద్యోగం చేయడం ఇష్టం లేకే రాజీనామా చేస్తున్నాను” అని అన్నారు.
కష్టకాలంలో ఉపాధ్యాయ సంఘాలు కానీ, తోటి టీచర్లు కానీ తన వెన్నంటి నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుండటంతో విద్యాశాఖ అధికారుల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.
