
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ : నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్. రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీ సహా అమెరికాలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలో సిటీ బ్యాంక్ మేనేజర్‌గా, జేపీ మోర్గాన్, ఫేస్బుక్ సహా పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు. రాజకీయాలపై మక్కువతో 2013లో బీజేపీలో చేరి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన నగరంలోని అనేక సమస్యలపై పోరాటాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ టికెట్టు దక్కకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. పలువురు పేర్లను పరిశీలించిన బీఆర్ఎస్ అధిష్ఠానం విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది.
——————–