మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
Graduate MLC Elections| ఆకేరు న్యూస్, హనుమకొండ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పలు విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులు, పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
విద్యాసంస్థల్లో ప్రచారం
గ్రావిటీ జూనియర్ కాలేజ్, రాప్టర్ అకాడమీ, గీతాంజలి డిగ్రీ కాలేజ్, రామప్ప కోచింగ్ అకాడమీలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రొఫెసర్ దినేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు విధానాన్ని వివరించారు.
ఓటు హక్కు కీలకం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యావంతులైన యువత రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సందేహాల నివృత్తి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ద్వారా విద్యావంతులు తమ సమస్యలు, ఆకాంక్షలను శాసనమండలిలో వినిపించే అవకాశం ఉంటుందని వివరించారు. అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియపై విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
విస్తృతంగా అవగాహన
ప్రతి అర్హుడైన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని మరిన్ని విద్యాసంస్థల్లో విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

