బీహార్ మ్యూజియం
* ఆసియాలో నంబర్ వన్
* లూవ్ర్, మెట్ కంటే ముందంజ
* ప్రపంచంలోని 100 ఉత్తమ మ్యూజియంల జాబితాలో 9వ స్థానం
Bihar Museum| ఆకేరు న్యూస్, డెస్క్: భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. బీహార్ రాజధాని పాట్నాలోని బీహార్ మ్యూజియం ప్రపంచంలోని 100 ఉత్తమ మ్యూజియంల జాబితాలో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీకి చెందిన ట్రావెల్ గైడ్, డిజిటల్ మ్యాగజైన్ ‘వర్త్ ఏ జర్నీ’ విడుదల చేసిన 2026 సంవత్సరపు ర్యాంకింగ్స్‌లో ఈ ఘనత సాధించింది. ఈ జాబితాలో ఆసియాలోనే అత్యున్నత ర్యాంకు పొందిన మ్యూజియంగా బీహార్ మ్యూజియం నిలిచింది. అంతేకాదు, టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా మ్యూజియం ఇదే.
లూవ్ర్, మెట్ కంటే ముందంజ
పారిస్‌లోని ప్రసిద్ధ లూవ్ర్ మ్యూజియం ఈ జాబితాలో 31వ స్థానంలో నిలవగా, న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (ది మెట్) 10వ స్థానంలో ఉంది. వీటన్నింటికంటే ముందుగా బీహార్ మ్యూజియం తొమ్మిదో స్థానాన్ని సాధించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మ్యూజియం కూడా ఇదే.
13.9 ఎకరాల్లో అద్భుత నిర్మాణం
పాట్నాలోని బైలీ రోడ్డులో సుమారు 13.9 ఎకరాల విస్తీర్ణంలో బీహార్ మ్యూజియం నిర్మించారు. ప్రఖ్యాత జపాన్ ఆర్కిటెక్ట్, ప్రిట్జ్కర్ అవార్డు గ్రహీత ఫుమిహికో మాకి, ముంబైకి చెందిన ఒపోలిస్ ఆర్కిటెక్ట్స్‌తో కలిసి దీనికి రూపకల్పన చేశారు. ఆధునిక నిర్మాణ శైలి, విశాలమైన ప్రాంగణాలు, ఓపెన్ కోర్ట్‌యార్డులు ఈ మ్యూజియం ప్రత్యేకతలు. 2015లో దీనిని ప్రారంభించారు.
చరిత్రకు అద్దం పట్టే కళాఖండాలు
బీహార్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఎన్నో అరుదైన వస్తువులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. పురాతన శిల్పాలు, నాణేలు, మాన్యుస్క్రిప్ట్‌లు, జానపద కళారూపాలు ఇందులో ప్రధాన ఆకర్షణలు. మౌర్యుల కాలానికి చెందిన దిదార్‌గంజ్ యక్షి శిల్పం, కుషాణుల కాలం నాటి బుద్ధుడి జననాన్ని చూపించే శిల్పం, పాల వంశానికి చెందిన కుర్కిహార్ కాంస్య విగ్రహాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ అంతర్జాతీయ గుర్తింపుతో పాట్నాలోని బీహార్ మ్యూజియం ప్రపంచ పర్యాటక, సాంస్కృతిక రంగాల దృష్టిని ఆకర్షించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

