హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
* హనుమకొండ జిల్లాలో అర్హుల జాబితా సిద్ధం
Mission Vatsalya| ఆకేరు న్యూస్, హనుమకొండ: మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వెల్లడించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మిషన్ వాత్సల్య పథకం లబ్ధిదారుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం కింద ఏడు కేటగిరీల్లో అర్హులను గుర్తించి ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ప్రాజెక్టు స్థాయిలో సీడీపీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారని వివరించారు. సామాజిక దర్యాప్తు నివేదికల ఆధారంగా అర్హుల వివరాలను బాలల సంక్షేమ సమితి ముందు ఉంచి, జిల్లా స్థాయి స్పాన్సర్షిప్ కమిటీ ఆమోదంతో తుది జాబితా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఏడు కేటగిరీల్లో ఎంపిక
తల్లిదండ్రులు లేని బాలబాలికలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, తల్లిదండ్రులు వదిలేయడంతో సంరక్షకుల వద్ద ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, వితంతు మహిళల పిల్లలు తదితర వర్గాలకు చెందిన అర్హులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. రక్షణ, సంరక్షణ, విద్య, వైద్యం, పోషకాహారం వంటి అవసరాలు ఉన్న బాలబాలికలకు ఈ పథకం ద్వారా అండగా నిలవనున్నట్లు వెల్లడించారు.
2026-27 సంవత్సరానికి సంబంధించి 28 మంది బాలబాలికలను ప్రత్యేకంగా గుర్తించి అర్హులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తంగా జిల్లాలో 216 మంది లబ్ధిదారులకు మిషన్ వాత్సల్య పథకం వర్తించనుందని స్పష్టం చేశారు.
అధికారుల హాజరు
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, బాలల సంక్షేమ సమితి సభ్యుడు డాక్టర్ పరికి సుధాకర్, సీడీపీఓలు వి. సింధురాణి, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సీహెచ్. అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్చార్జి అధికారి ఎస్. ప్రవీణ్ కుమార్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్, శిశు గృహ మేనేజర్ ఆరే శిరీష, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఝాన్సీ, సునీత, కల్పన, రాణి, సోషల్ వర్కర్లు ఎం. శ్రీనివాసులు, జి. సునీత, ఎస్. చైతన్య, ఓఆర్డబ్ల్యూలు పి. విజయ్ కుమార్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

