Thoopranpet Murder
* బంగారం, వెండి కోసం దారుణం
ఆకేరు న్యూస్, భువనగిరి : ఇంటి రుణం ఈఎంఐలు చెల్లించేందుకు డబ్బు అవసరమై ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
అమ్మమ్మ వద్ద ఉన్న బంగారం, వెండిని తీసుకునేందుకు ఆమెను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం తుప్రాన్పేటలో చోటుచేసుకుంది.
తుప్రాన్పేటకు చెందిన మంటిపల్లి రాజు (31) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సుమారు రూ.36 లక్షలకు ఇల్లు కొనుగోలు చేసిన రాజు ఇందుకోసం బ్యాంకు రుణం తీసుకున్నాడు.
రుణానికి సంబంధించిన నెలవారీ ఈఎంఐలను చెల్లించాల్సి ఉండటంతో ఆర్థిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో రాజు తన అమ్మమ్మ అయిన మంటిపల్లి యాదమ్మ (70) వద్ద ఉన్న నగలపై కన్నేశాడు. యాదమ్మ వద్ద సుమారు 5.6 తులాల బంగారం, 1.59 కిలోల వెండి ఉన్నట్లు అతడికి తెలుసు వాటిని తనకు ఇవ్వాలని రాజు కోరగా.. యాదమ్మ అందుకు నిరాకరించినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో నగల కోసం ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
యాదమ్మ ఒంటిపై ఉండాల్సిన బంగారు నగలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు కాల్ డేటాను పరిశీలించారు. యాదమ్మతో పరిచయం ఉన్న వ్యక్తులు, ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంటి పరిసరాల్లో ఉన్నవారి వివరాలను సేకరించారు.
ఈ క్రమంలో రాజుపై పోలీసులకు అనుమానం కలిగింది. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అనంతరం రాజే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఇంటి రుణం ఈఎంఐలు చెల్లించేందుకు అవసరమైన డబ్బు కోసం అమ్మమ్మ వద్ద ఉన్న బంగారం, వెండిని తీసుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె నిరాకరించడంతో హత్య చేసి నగలను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనతో తుప్రాన్పేటలో విషాదం నెలకొంది. ఆర్థిక సమస్యల కారణంగా సొంత కుటుంబ సభ్యురాలినే హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసుకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
