GWMC Woman Employee Harassment
ఆకేరు న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) లో తీవ్ర కలకలం రేగింది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనా నగరంలో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
నమ్మదగిన సమాచారం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న సదరు మహిళా ఉద్యోగిని, అక్కడే పనిచేస్తున్న సీ1 (C1) సూపరింటెండెంట్ అడిషనల్ కమిషనర్ ఛాంబర్‌కు పిలిపించారు. అందరి ముందే ఆమెను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. మానసికంగా తీవ్ర క్షోభకు గురిచేసేలా సదరు అధికారి ప్రవర్తించడంతో, తట్టుకోలేకపోయిన ఆ మహిళా ఉద్యోగి తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
* “నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ బెదిరింపులు…
సదరు సి1 సూపరింటెండెంట్ బాధితురాలిని తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. “నిన్ను ఎక్కడికైనా బదిలీ చేయగలను.. నువ్వు ఎవరికి చెప్పుకున్నా నన్ను ఏమీ చేయలేరు” అంటూ అహంకారపూరితంగా మాట్లాడి బెదిరించినట్లు సమాచారం. కాగా, సదరు సీ1 సూపరింటెండెంట్ గత ఏడేళ్లుగా ఒకే స్థానంలో (అక్కడే) తిష్టవేసి విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. చాలా కాలంగా ఒకే చోట ఉండటంతో తనను ఎవరూ ప్రశ్నించలేరనే ధీమాతోనే సిబ్బందిపై ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి
ఈ ఘటనపై తోటి ఉద్యోగులు మరియు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి కారణమైన సదరు సూపరింటెండెంట్‌పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
