Heart Attack Warning Signs
ఆకేరు న్యూస్, డెస్క్: నేటి ఆధునిక కాలంలో గుండెపోటు (Heart Attack) అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతోంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే ఈ సమస్య, ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. చాలా మంది ఛాతిలో చిన్న నొప్పి రాగానే అసిడిటీ లేదా గ్యాస్ ట్రబుల్ అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఇలాంటి నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తెస్తుందని హెచ్చరిస్తున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్. గుండెపోటు రావడానికి గల కారణాలు, దాని ముందస్తు లక్షణాలపై ఆయన అందించిన ప్రత్యేక విశ్లేషణ మీకోసం..
*ప్రధాన కారణాలు…
మన శరీరంలో గుండె అనేది ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. మనం నిద్రపోతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా.. గుండె మాత్రం 365 రోజులు, 24 గంటలు నిరంతరాయంగా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇంతలా పనిచేసే గుండె కండరాలకు కూడా రక్తం, ఆక్సిజన్, పోషకాలు అవసరం. వీటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలను మనం ‘కరోనరీ ధమనులు’ అంటారు. ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల లేదా రక్తం గడ్డకట్టడం వల్ల పూడికలు (Blockages) ఏర్పడి, అవి సడన్గా మూసుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది. దాన్నే మనం గుండెపోటు అంటాము.
*వారిలో వచ్చే అవకాశం ఎక్కువ
ముఖ్యంగా మధుమేహం (షుగర్ వ్యాధి), అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారిలో, అలాగే స్మోకింగ్ (ధూమపానం) చేసే అలవాటు ఉన్నవారిలో ఈ ముప్పు చాలా ఎక్కువ. వయస్సు విషయానికి వస్తే 40 ఏళ్లు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ.. అంటే తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే వారి పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు, ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం, దీనివల్ల కూడా యువతలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
*గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు
నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. గుండెపోటుకు ప్రధాన లక్షణం ‘ఛాతి నొప్పి’. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. బొడ్డు భాగం నుండి పై దవడ వరకు మధ్యలో ఏ ప్రాంతంలో నొప్పి వచ్చినా, దానిని గుండెకు సంబంధించిన నొప్పిగానే అనుమానించాలి. ఈ నొప్పితో పాటు రోగికి విపరీతంగా చెమటలు పట్టడం, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం, ఎడమ చేయి లాగడం వంటివి జరుగుతాయి. కొంతమందిలో ఒకటి లేదా రెండు సార్లు వాంతులు కావడం, మోషన్స్ అవ్వడం కూడా జరగొచ్చు.
ALSO READ :
*ముఖ్యంగా..
ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు లేదా ఒక నాలుగు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఛాతిలో నొప్పి క్రమంగా పెరుగుతోంది అంటే, అది ఖచ్చితంగా గుండె జబ్బుకు సంబంధించిన లక్షణమే అని గ్రహించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించడం చాలా అవసరం.
*ఆరోగ్యమే మహాభాగ్యం
గుండె ఆరోగ్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కావచ్చు. ఈ కథనంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి. మల్లికార్జున రావు తెలిపిన ముందస్తు లక్షణాలను గుర్తుంచుకోండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి వారిలోనూ అవగాహన పెంచండి. ఇటువంటి మరిన్ని విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం, నిపుణుల సలహాల కోసం మా వెబ్సైట్ను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను క్రింది కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి! స్టే హెల్తీ – స్టే సేఫ్.
