* వరదల్లో ఉమామహేశ్వర క్షేత్రం.. మహబూబ్‌నగర్ ఆస్పత్రి
* ఇబ్బందులు పడుతున్న ప్రజలు
* రెడ్ అలర్ట్ జోన్లో కరీంనగర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాన దంచికొడుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahaboobnagar), వరంగల్(Warangal), కరీంనగర్(Karimnagar), నల్లగొండ(Nallagonda) జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్(Red allert) ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఆస్పత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఇక, జడ్చర్లలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో పట్టణంలో ప్రభుత్వ దవాఖానను వరద నీరు చుట్టుముట్టింది. హాస్పిటల్ ప్రవేశమార్గంలో మోకాల్లోతు నీరు ప్రవహిస్తున్నది. దీంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్ జిల్లాలో.. ఆగమాగం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేటలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుజూర్‌నగర్‌లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా(Waranaal District)లో కూడా భారీ వర్షం కురుస్తున్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, మహబూబాబాద్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, తొర్రూరులో వాన పడుతున్నది. గార్లలో పాకాల వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు మండలం కంటయపాలెం వద్ద వంపు వాగు పొంగిపొర్లుతుండటంతో తొర్రూరు-కంటాయపాలెం మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
————————