Huzurabad United Districts Cricket Tournament Champion
* యువత క్రీడల్లో రాణించాలన్న వొడితల ప్రణవ్
* ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తామన్న స్వర్గం రవి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో వరంగల్ – కరీంనగర్ ఉమ్మడి జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గం రవి తల్లిదండ్రులైన స్వర్గం సరోజ – రాజేశ్వరరావుల స్మారకార్థం ఉప్పల్ ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో హుజూరాబాద్, ఉప్పల్ జట్లు తలపడ్డాయి. ఇందులో హుజూరాబాద్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 50,000 నగదు బహుమతిని గెలుచుకోగా, స్థానిక ఉప్పల్ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ. 25,000 చెక్కును, ట్రోఫీని అందుకుంది. హుజూరాబాద్ జట్టు ఆటగాడు నవీన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు.
ఈ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ రోంటాల సుహాసిని ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, యువత అద్భుతమైన క్రీడాకారులుగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో స్థానికులు ఉప్పల్ ప్రభుత్వ బాలుర పాఠశాల గ్రౌండ్‌ను అభివృద్ధి చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమ నిర్వాహకులు స్వర్గం రవి మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నీ నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీలను నిర్వహిస్తామని అన్నారు. 30 రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంట్‌ను స్థానిక సర్పంచ్ రమ – నాగరాజుతో కలిసి ఆర్గనైజింగ్ టీమ్ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని ఆయన అభినందించారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ రోంటాల సుహాసిని మాట్లాడుతూ, యువత సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ ముగింపు వేడుకల్లో కమలాపుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి,ఉపసర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, ,వార్డు మెంబర్లు,నాగరాజు, బాలసాని రమేష్, మాజీ సర్పంచులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
