Malkajgiri Wife Shooting Murder
* నమ్మించి.. కాల్చి చంపిన భర్త
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ ఆయుధాల సంస్కృతి మరో మహిళ ప్రాణాలను బలితీసుకుంది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రెండో భార్యపై పెంచుకున్న అనుమానంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు.
* పోలీసుల విచారణ ప్రకారం..
మల్కాజ్గిరి మారుతీనగర్‌కు చెందిన అరుణ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, మొదటి భార్య సోదరి అయిన నిషారాణి (నిషిత రాణి)ని అరుణ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే ఉన్నా.. ఇటీవల నిషారాణి ప్రవర్తనపై అరుణ్ తీవ్రమైన అనుమానాలు పెంచుకున్నాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరగడంతో ఆమె భర్తకు దూరంగా ఉండటం ప్రారంభించింది.
* ‘బీహార్ గన్’.. టాస్క్‌ఫోర్స్ ఎంట్రీ…
భార్యపై పగ పెంచుకున్న అరుణ్, ఎలాగైనా ఆమెను అంతం చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఒక స్కెచ్ వేశాడు. బీహార్ రాష్ట్రం నుండి అక్రమంగా ఒక దేశవాళీ తుపాకీ, బుల్లెట్లను తెప్పించుకున్నాడు. అంతటితో ఆగకుండా తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే, ఆ సమయంలో పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకుని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్పట్లో అతని హత్యాయత్నం ప్లాన్ విఫలమైంది.
* నమ్మించి స్పాట్లోనే ముగించాడు..
జైలుకు వెళ్లొచ్చినా అరుణ్ ఆలోచనలో మార్పు రాలేదు. బుధవారం తెల్లవారుజామున “ఒకసారి మాట్లాడుకుందాం రా” అంటూ నిషారాణిని బయటకు పిలిచాడు. అరుణ్ మాటలు నమ్మి వచ్చిన ఆమెపై, ముందస్తు ప్రణాళిక ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న మరో తుపాకీతో అరుణ్ ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ దారుణానికి అతనితో పాటు మరో వ్యక్తి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. తుపాకీ గాయాలతో నిషారాణి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
* పాతబస్తీ లింకులు…
కాల్పుల అనంతరం నిందితుడు అరుణ్ తన అనుచరుడితో కలిసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయుధం స్వాధీనం చేసుకున్నప్పటికీ, మళ్లీ అరుణ్‌కు తుపాకీ ఎలా వచ్చింది? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పాతబస్తీలోని కొందరు స్నేహితుల ద్వారానే అతను ఈ రెండో తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
