– కనులపండువగా రథయాత్ర
– భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘జై బోలో జగన్నాథ స్వామి’ అన్న నినాదాలు హైదరాబాద్(HYDERABAD)లో హోరెత్తాయి. జగన్నాథ రథయాత్ర కనులపండువగా సాగింది. మేళతాళాలు, భాజాభజంత్రీల మధ్య హరినారాయణ అంటూ నృత్యాలు చేస్తూ జగద్రక్షకుడిని భక్తులు స్తుతించారు. స్వామి వారిని చూస్తూ పరవశించి పోయారు. బంజారాహిల్స్, ముషీరాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ (SECUNDERABAD)తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 శ్రీ జగన్నాథస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా వేడుక నిర్వహించారు. ఉదయం నుంచే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. బలభద్రుడు, జగన్నాథుడు, సుభద్ర దేవీల కోసం మూడు రథాలను ప్రత్యేకంగా ఆలంకరించారు. ఈ రథాల మీదకు దేవతామూర్తులను తీసుకువచ్చే ముందు అర్చకులు చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒరియా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం అక్కడి కళాకారులు భజనలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాల మధ్య విగ్రహాలను రథాల మీదకు చేర్చారు. రథం (RATHAM) మీద ఆసీనులైన దేవతామూర్తులను దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. పోలీసులు క్యూ ఏర్పాటు చేసి దర్శన సౌకర్యం కల్పించారు. పూజాధికాలు అయిపోగానే రథాల ఊరేగింపు మొదలైంది. నగరంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు రథాలను లాగేందుకు ఉత్సాహం చూపారు.
……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
