Palakurthi CI Bharat Suman
* సీఐకి ‘మోకు దెబ్బ’ వినతి
* మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన నాయకులు
ఆకేరు న్యూస్, పాలకుర్తి : మండల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్‌ను ‘మోకు దెబ్బ’ గౌడ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో గీత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సిఐకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మోకు దెబ్బ నాయకులు మాట్లాడుతూ”గీత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మా గౌడ కుటుంబాల బతుకులు, గ్రామాలలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ బెల్టు షాపుల వల్ల వీధిన పడుతున్నాయని. బెల్టు షాపుల వల్ల మద్యం విచ్చలవిడిగా లభ్యమై, మా సొసైటీల రాబడి పడిపోవడమే కాకుండా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి” అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని, గీత కార్మికుల జీవితాలకు రక్షణ కల్పించాలని సిఐ ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిఐ భరత్ సుమన్, చట్టవ్యతిరేకంగా నడిచే బెల్టు షాపులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ‘మోకు దెబ్బ’రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోషాల వెంకన్న గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కమ్మగాని వెంకన్న గౌడ్, మోకు దెబ్బ జిల్లా యూత్ అధ్యక్షులు పూల నారాయణ గౌడ్, పాలకుర్తి మండల అధ్యక్షులు కమ్మగాని మధు గౌడ్, జిల్లా నాయకులు బుర్ర వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
