NMMS App Attendance Issue
* ఎన్ఎంఎంఎస్ యాప్ తీరు
* ముక్కున వేలేసుకున్న కూలీలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఉపాధి హామీ కూలీ ఫోటో క్యాప్చర్ (మ్యాచ్) కోసం గుండు పై తన భార్య జడను వేసుకొని ఫోటో దిగాల్సిన అమానవీయ సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెంలో బుధవారం జరుగగా ఈ ఘటనను సిపిఎం మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన పోలు రాజు తండ్రి యాదగిరి నెల రోజుల క్రితమే మృతి చెందాడు. హిందూ ఆచార, సాంప్రదాయాల ప్రకారం తండ్రి చనిపోతే కొడుకు గుండు చేయించుకోవడం ఆనవాయితీ. రాజు సాంప్రదాయాన్ని గౌరవించి తండ్రి కర్మకాండ చేసి గుండు చేయించుకున్నారు. దశదిన కర్మ అనంతరం గతంలో వెళ్లినట్లు ఉపాధి పనులకు బుధవారం వెళ్ళాడు. కానీ ఉపాధి హామీ పని దగ్గర NMMS యాప్లో ఫోటో మ్యాచ్ కాలేదు. “గుండుతో ఉన్నావు, పాత ఫోటోలో జుట్టు ఉంది, హాజరు వేయం” అని ఫీల్డ్ అసిస్టెంట్ తెగేసి చెప్పాడు. రోజు కూలీ ₹245 కోసం, కుటుంబాన్ని బతికించుకోవడం కోసం రాజు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అదే సమయంలో తన భార్యకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది
భార్య తన జడ తీసి భర్త తలపై కప్పితేనే యాప్లో ఫోటో మ్యాచ్ అయింది. ఉపాధి హామీ పనుల్లో హాజరు పడింది. తండ్రి చావు బాధ ఒకవైపు, కూలీ కోసం భార్య జడతో తలపై కప్పుకోవాల్సిన అవమానం మరోవైపు ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా?
అని కూలీలు ముక్కు మీద వేలు వేసుకున్నారు. “డిజిటల్ ఇండియా” పేరుతో కేంద్ర ప్రభుత్వం NMMS యాప్, ‘ఫేషియల్ రికగ్నిషన్’ తెచ్చి కూలీలను వేధిస్తోంది. ఒక మనిషి చనిపోతే గుండు చేయించుకోవడం మన సంస్కృతి తెలియని మూర్ఖపు సాఫ్ట్వేర్ తీరును కూలీలు తిట్టుకుంటున్నారు.
‘నిబంధనలు సడలించాలి” చావు, పుట్టుక, అనారోగ్యం లాంటి సందర్భాల్లో ఫోటో మ్యాచ్ అవసరం లేదని జీవో (GO) ఇవ్వాలని, మాన్యువల్ హాజరు పునరుద్ధ రించాలని, టెక్నాలజీ పేరుతో కూలీలను వేధించడం ఆపాలని సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
