Collector Sandeep Kumar Jha
* జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచనలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి దొండ, సొర, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల విధానంలో ఏర్పాటు చేసిన తోటను పర్యవేక్షించి తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తోట ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని రైతును అభినందించారు. పంట మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను తొలగించి, కలుపు నియంత్రణ చేపట్టాలని సూచించారు. నీటి నిర్వహణ, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా రైతును పంట సాగు విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్, తదితర అంశాలపై ఆరా తీశారు. పొలంలో ఉన్న పత్తి పంటను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
