* ఒక్కో టికెట్ రూ.15 వేలు పైనే
* క్రికెట్ అభిమానుల్లో కలవరం
* హెచ్ సీఏపై ఆగ్రహం
* ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, హైదరాబాద్
క్రికెట్ పై యువకులకు ఉన్న క్రేజును కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తూ దందా సాగిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 వ సీజన్ లో ఈ బ్లాక్ దందా విపరీతంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఉప్పల్ స్టేడియంలో జరిగే హైదరాబాద్ సర్ రైజర్స్ మ్యాచ్ లకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో టికెట్ లు దొరకడం కష్టంగా మారుతోంది. ఈ మ్యాచ్ లు వీక్షించేందుకు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ తదితర జిల్లాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పేటీఎం ద్వారా ఈ టికెట్లను విక్రయిస్తోంది. జరగబోయే మ్యాచ్లకు టికెట్లను ఇస్తున్నట్లు ప్రకటిస్తున్న 10, 20 నిమిషాలకే అయిపోతుండడంపై క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టాయి. స్టేడియంలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్టేడియం సిబ్బందికి, విద్యార్థులకు మధ్య తోపులాట చేటుచేసుకుంది. క్యాపిటర్స్ వర్సెస్ సన్రైజర్స్ మ్యాచ్ కు సంబంధించి 20 నిమిషాలలోనే 70 వేల టికెట్లు అమ్ముడుపోవడం అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలా అమ్ముతున్నారు.. ఎవరికి అమ్ముతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. హెచ్సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాను అరికట్టాలని స్టేడియం ఎదుట విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు.
తాజాగా ముగ్గురి అరెస్ట్
ఒకవైపు టికెట్ల బ్లాక్ దందాపై ఆందోళనలు కొనసాగుతుండగానే.. మరోవైపు కొండాపూర్ లో బ్లాక్ లో ఐపీఎల్ టికెట్లను అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు చెందిన 15 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ 10 వేల నుంచి 15 వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న 11 మందిని అరెస్టు చేశారు.
————————-