
* కరెంటు పోతే.. పని ఖతమేనా
* పట్టించుకోని అధికారులు
ఆకేరు న్యూస్, జనగామః అది నిత్యం వందలాది మందికి సేవలు అందించే కార్యాలయం.. మండలానికే అది కేంద్ర బిందువు.. భూములు, జాగలు, సచ్చుడు.. బతుకుడు.. నివాసం… ఆదాయం.. కులం.. మతం.. అంటూ ప్రతి పనికి అక్కడికే జనం పోతారు. నిత్యం జనం పనులతో కిటకిటలాడే ఆ ఆఫీసులో కరెంటు పోతే.. ఆ ఏమైతది.. గంత పెద్ద ఆపీసులో కరెంటు పోతే జనరేటర్ ఉండదా.. చిత్రం కాకపోతే గిదేం ప్రశ్న.. వందలాది మందికి సేవ చేసే ఆ ఆపీసులో.. పదుల సంఖ్యలో ఉద్యోగులు పనిచేసే ఆ ఆఫీసులో కరెంటు పోతే.. ఖచ్చితంగా జనరేటర్ ఉంటది.. లేదా.. ఇన్వర్టర్ ఉంటది అనే ప్రతి ఒక్కరికి అనిపిస్తది.. కాకుంటే జనాలు అనుకునే మాట నిజమే.. ఏందంటే.. ఇన్వర్టర్ ఉంది.. జనరేటర్ ఉంది.. మరికేంది.. ఒకవేళ కరెంటే పోతే.. ఇన్వర్టర్, జనరేటర్ పని చేస్తయి అనుకుంటం కదా.. కాని కాదండి.. ఇన్వర్టర్ పనిచేస్తది.. అది కేవలం ఒక్క ఇద్దరు సార్లకే పనిచేత్తది.. మరి మిగతా ఉద్యోగులకు.. అదే జనరేటర్ పనిచేస్తది అనుకుంటుండ్లు కదా.. అదేం కాదు.. అసలు జనరేటర్ ఉన్నా అది సోకుకేనండి.. అది అస్సలు పనిచేయదు.. కాని చూసేవారికి అది పనిచేస్తున్నట్లు ఉంటుంది.. అంటే పైన పటారం లోన లొటారం అన్నట్లా.. ఆ గట్లనే.. ఆ జనరేటర్ చూపుకు సుంగారం.. దాని పని ఇకారంగా ఉంటది మరి. అందుకే అంటన్న ఆ ఆఫీసులో కరేంటు పోతే ఏంది సంగతి అని.. ఇంకేముంది.. జనరేటర్ పనిచేయది గనుక ఉద్యోగులంతా.. పేపర్లు ఊపుకుంటా కూసునుడే.. కాగితాలతో కుస్తి పట్టుడే.. పని ఆగిపోవుడే.. పనికోసం ఒచ్చినోల్లు… సచ్చుకుంట చెట్ల కింద కాల్లు జాపుకుని కూసునుడే అయితంది. ఇంతకు ఇది ఏ ఆఫీసో చెప్పలేదు కదూ సుమా.. అదేనండి.. పాలకుర్తి తహాసీల్ధార్ ఆఫీసు.. ఇప్పుడు కరెంటు లేకుంటే ఇది తాసీలి ఆఫీసు అంటున్నారు జనాలు. గతంలో సర్కారు తహాసీల్దార్ ఆఫీసుకు జనరేటర్ ఏర్పాటు చేసింది. కానీ దాని కాలం ముగియడంతో అది పనిచేయడం లేదు. అని పనిచేయకుండా గత నాలుగైదు ఏండ్లుగా ఉంటున్నా.. పట్టించుకునే నాధులే లేకుండా పోయారు. కేవలం ఇన్వర్టర్లు ఉంటే.. అవి కేవలం తహాసీల్దార్ ఉండే రూంకు, సెక్షన్ లో ఒక కంప్యూటర్ కు మాత్రమే కనెక్షన్ ఉన్నాయి. ఇక మిగతా కంప్యూటర్లు కరెంటు పోతే.. మూగనోము పట్టాల్సిందే. ఇదే విషయమై డిప్యూటి తహాసిల్ధార్ వేణుగోపాల్ రెడ్డిని అడిగితే.. కరెంటు పోతే.. కంప్యూటర్లు పనిచేయవు.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి.. జనరేటర్ పనిచేయడం లేదు అని అన్నారు. ఇకనైనా అధికారులు జనరేటర్‌ను బాగు చేయించి.. జనాల సమస్యలు తీర్చుతారని జనాలు కోరుతున్నారు.
………………………………………………..