* సమ్మక్క హుండీలో యువతి లేఖ!
ఆకేరు న్యూస్,జనగామ: సాధారణంగా జాతరలో భక్తులు ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకుంటారు. కానీ, జనగామ జిల్లాలో జరిగిన సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలో ఒక భక్తురాలు తన మనసులోని మాటను నేరుగా అమ్మవార్లకే విన్నవించుకుంది. హుండీలో ఆమె వేసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఇటీవల సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఘనంగా జరిగింది. సోమవారం ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు హుండీలోని కానుకలను లెక్కిస్తుండగా ఒక లేఖ ప్రత్యక్షమైంది. ఆ లేఖలో ఒక యువతి “తల్లీ.. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా దీవించు. అలాగే నేను ఇష్టపడిన శ్రీధర్తో నా పెళ్లి జరిగేలా చూడు. ఈ రెండు కోరికలు నెరవేరితే, వచ్చే జాతర నాటికి నా శక్తి మేరకు నీకు బంగారాన్ని మొక్కుగా సమర్పించుకుంటాను” అని ఆ అజ్ఞాత భక్తురాలు తన లేఖలో పేర్కొంది.సాధారణంగా మొక్కులంటే ఎత్తు బెల్లం సమర్పిస్తామని కోరుకుంటారు. కానీ, ఈ యువతి తన కెరీర్ (ప్రభుత్వ ఉద్యోగం) మరియు వ్యక్తిగత జీవితం (ప్రేమించిన వ్యక్తితో వివాహం) రెండింటినీ అమ్మవార్లకే అప్పగించేయడం విశేషం. ఈ లేఖను చూసిన అధికారులు సైతం ఆమె అమాయకత్వానికి, నమ్మకానికి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట కూడా హాట్ టాపిక్ అయింది. “ఆమె నమ్మకం నిజమవ్వాలని, శ్రీధర్తో పెళ్లి జరగాలని” నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు….
…………………………………………………………………..
