Kakatiya University
Kakatiya University| ఆకేరు న్యూస్, వరంగల్: పర్యాటకం ద్వారా కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు వివిధ సంస్కృతులు, చరిత్ర, సంప్రదాయాలు, ప్రకృతిని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్రా రాజు గౌడ్ అన్నారు. విద్యార్థులు పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు వాటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలని సూచించారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ టూరిజం విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విభాగం హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, డాక్టర్ చిర్రా రాజు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రయాణంతో జ్ఞానం
ఈ సందర్భంగా డాక్టర్ చిర్రా రాజు గౌడ్ మాట్లాడుతూ.. “ప్రయాణం ఒక పుస్తకం.. ప్రతి అడుగు ఒక పాఠం” అన్నారు. తరగతి గది, పుస్తకాల ద్వారా పొందే విద్యతో పాటు ప్రత్యక్ష అనుభవం విద్యార్థుల జ్ఞానాన్ని మరింత విస్తృతం చేస్తుందని తెలిపారు. కొండలు, నదులు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్నారు.
వారసత్వాన్ని కాపాడాలి
తెలంగాణలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను యువత సందర్శించి వాటి ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలని సూచించారు. కాకతీయుల కళా వైభవం, రామప్ప ఆలయ శిల్ప సంపద వంటి వారసత్వ కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత పాటిస్తూ, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు.
ప్రతి విద్యార్థి పర్యాటక రంగం, వారసత్వ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని డాక్టర్ చిర్రా రాజు గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ పర్యాటక వైభవాన్ని ఇతరులకు పరిచయం చేయడంలో యువత భాగస్వాములు కావాలని సూచించారు.
కార్యక్రమంలో హిస్టరీ అండ్ టూరిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ బిక్షపతి, డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్, డాక్టర్ కృష్ణ సుమంత్, డాక్టర్ నాగేశ్వర్, నరేందర్, డాక్టర్ కుమార్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
