Kalvakuntla Kavitha Farmer DISCOM Telangana
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రైతు డిస్కమ్’ నిర్ణయం తెలంగాణ రైతాంగాన్ని పచ్చిదగా చేయడమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఈఆర్సీ (TG ERC) నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో ఆమె స్వయంగా పాల్గొని, రైతుల పక్షాన బలమైన వాదనలు వినిపించారు. ఈ ప్రతిపాదన వ్యవసాయ రంగానికి ఎండ్రీన్ పోసి చంపేసే కుట్ర అని, తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే ఈ ముసాయిదాను ఈఆర్సీ తక్షణమే తిరస్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
* ఆరు నెలలుగా ఎందుకు సీక్రెట్‌గా ఉంచారు?
రైతు డిస్కమ్ అనేది నిజంగా రైతులకు మేలు చేసే నిర్ణయమే అయితే, గత ఆరు నెలలుగా ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు అత్యంత రహస్యంగా ఉంచిందని కవిత ప్రశ్నించారు. ఈఆర్సీ చొరవతోనే ఈ అంశం బయటకు వచ్చిందే తప్ప, ప్రభుత్వం దీన్ని బహిర్గతం చేయలేదన్నారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే.. వారికున్న అపోహలను తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదని, కనీసం అసెంబ్లీలో కూడా దీనిపై ఎందుకు చర్చ పెట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇందులో ఏదో పెద్ద దురుద్దేశం ఉందనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు.
“తెలంగాణలోని 29 లక్షల బోర్ల మోటార్ల పరిస్థితిని ఈ నిర్ణయం డోలాయనంలో పడేస్తుంది. సంపూర్ణంగా తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఈ సున్నితమైన అంశంపై కేవలం ఇక్కడే కాకుండా, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి.”
* కేసీఆర్ పాలనలో పుంజుకున్న వ్యవసాయం..
తెలంగాణ వస్తే చీకటవుతుందన్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ, గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి అద్భుతమైన మార్పులు తెచ్చిందని కవిత గుర్తుచేశారు. రైతులు ఎంతో కష్టపడి 29 లక్షల బోర్లు వేసుకున్నారని.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లాంటి మేజర్ ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోయినా, బోర్ల ద్వారా 24 గంటల ఉచిత కరెంట్ అందించి వ్యవసాయాన్ని కాపాడుకున్నామని చెప్పారు. గతంలో 20 లక్షల టన్నులు మాత్రమే ఉన్న ధాన్యపు దిగుబడి, కేసీఆర్ గారి కృషితో కోటి 40 లక్షల టన్నులకు చేరిందని వివరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వల్ల రైతాంగం మొత్తం మోసపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
* లోపభూయిష్టమైన నిర్వహణ.. ఉద్యోగుల కొరత
కొత్త డిస్కమ్‌కు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న లెక్కలపై కవిత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త డిస్కమ్‌కు 42 శాతం విద్యుత్ లోడ్‌ను బదిలీ చేస్తూ, కేవలం 2 వేల మంది ఉద్యోగులను మాత్రమే కేటాయించడం హాస్యాస్పదమన్నారు. అందులోనూ వెయ్యి మంది ఆఫీసుల్లో లెక్కలు రాసేవారే ఉంటారని, క్షేత్రస్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయడానికి మిగిలేది వెయ్యి మందేనని లెక్కగట్టారు. అంటే మండలానికి కనీసం ఒక్క ఉద్యోగి కూడా ఉండని పరిస్థితి వస్తుందన్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్లను ఇప్పుడు తాలూకా కేంద్రాలకు మారుస్తున్నారని, దీనివల్ల ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రిపేర్ కావడానికి రెండు నెలల సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇతర డిస్కమ్‌ల సేవలను వాడుకుంటామని ప్రభుత్వం చెప్తున్నా, ప్రభుత్వ విభాగాల మధ్య సరైన కో-ఆర్డినేషన్ ఉండదనేది జగమెరిగిన సత్యమని కొట్టిపారేశారు.
* రూ. 69 వేల కోట్ల నష్టాలు.. అసలు దోషి ప్రభుత్వమే!
డిస్కమ్‌లు ప్రస్తుతం రూ. 69 వేల కోట్ల నష్టాల్లో ఉంటే, అందులో రూ. 54 వేల కోట్లు ప్రభుత్వమే డిస్కమ్‌లకు బాకీ ఉందని కవిత స్పష్టం చేశారు. సబ్సిడీలు, డొమెస్టిక్ ఫ్రీ కరెంట్ బకాయిలతో కలిపి ప్రభుత్వం మొత్తం రూ. 35 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇస్తే మన డిస్కమ్‌లు మంచి రేటింగ్‌లో ఉంటాయని, ‘సి మైనస్’ రేటింగ్ రావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఇప్పటికే రూ. 25 వేల కోట్ల నష్టాల్లో ఉన్న విభాగాన్ని కొత్త కంపెనీ పేరుతో రిజిస్టర్ చేస్తే అది ఎలా లాభాల్లోకి వస్తుందని, అసలు ఈ కొత్త డిస్కమ్ ఆర్థికంగా ఎలా మనుగడ సాగిస్తుందని (Viable) ప్రశ్నించారు.
* విద్యుత్ రంగంలో ఆంధ్రా అధికారుల పెత్తనమా?
తెలంగాణ సాధించిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఇక్కడి విద్యుత్ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడ్డారని కవిత కొనియాడారు. అయితే, ప్రస్తుతం స్థానిక 1,200 మంది తెలంగాణ ఉద్యోగులకు కష్టం వస్తే పట్టించుకోని ప్రభుత్వం.. ఆంధ్రా నుంచి ఫోర్స్‌ఫుల్‌గా వచ్చిన 1,700 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కట్టబెట్టిందని ఆరోపించారు. జెన్కో, రెడ్కో, సదరన్ డిస్కమ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆంధ్రా వాళ్ల పెత్తనమే నడుస్తోందని మండిపడ్డారు. విభజన చట్టాలను పక్కనబెట్టి వచ్చిన ఆంధ్రా ఉద్యోగులను లూప్ లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చే రైతు డిస్కమ్‌లో కచ్చితంగా తెలంగాణ వాళ్లే ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
* మీటర్లు పెట్టే కుట్ర..ప్రైవేటీకరణకు అడుగులు
కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని కండిషన్లకు లొంగిపోతూ, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ఈ ప్రభుత్వం లోపాయికారీగా చర్యలు చేపడుతోందని కవిత ఆరోపించారు. యూనిట్ రూ. 6 పడే థర్మల్ పవర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, కాలక్రమేణా డిస్కమ్‌ను ప్రైవేట్ పరం చేయాలనే పెద్ద కుట్ర ఇందులో దాగి ఉందన్నారు. “వ్యవసాయం ఈ ప్రభుత్వానికి రెండో ప్రాధాన్యత అంట.. ఇది చాలా తప్పు. ప్రభుత్వం వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకొని వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి” అని హెచ్చరించారు.
* 1999 నాటి కాల్పుల ఘటనలు కొనితెచ్చుకోవద్దు!
రైతులకు అన్యాయం చేస్తూ, గతంలో విద్యుత్ ఉద్యమ సమయంలో జరిగిన 1999 నాటి బషీర్‌బాగ్ కాల్పుల ఘటనల వంటి పరిస్థితులను ప్రభుత్వం స్వయంగా కొని తెచ్చుకోవద్దని కవిత హితవు పలికారు. ఒకవేళ ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ ఈ రైతు డిస్కమ్‌కు లైసెన్స్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము స్వయంగా ప్రతి రైతు వద్దకు వెళ్లి, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత నిర్ణయాలను, కుట్రలను ప్రజల ముందు ఎండగడతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
