Tirupati Bomb Threat Hotel
* ఫేక్ కాల్‌గా తేల్చిన పోలీసులు
ఆకేరు న్యూస్, తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ రాజ్‌పార్క్ హోటల్‌కు శుక్రవారం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అలిపిరి ఇన్చార్జి సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని హోటల్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
* ఇంటర్నెట్ కాల్‌తో బెదిరింపు..
ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా హోటల్లో బాంబు పెట్టినట్లు హెచ్చరించాడు. దీంతో హోటల్లో బస చేస్తున్న అతిథులు, సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
* రంగంలోకి బాంబు స్క్వాడ్..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. హోటల్లోని గదులు, పార్కింగ్ ప్రాంతం, సమావేశ మందిరాలు, వంటశాల, ప్రవేశ ద్వారాలు సహా అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు గంటలపాటు సోదాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
* ఫేక్ కాల్‌గా తేల్చిన పోలీసులు
సమగ్ర తనిఖీల అనంతరం హోటల్లో ఎలాంటి బాంబు లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఫేక్ కాల్ కారణంగానే జరిగిందని ప్రాథమికంగా తేల్చారు.
అయితే బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటర్నెట్ కాల్ వివరాలను సేకరించి నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
