Kalvakuntla Kavitha, Prepaid Smart Meters Telangana
* కరెంట్‌ను అదానీ చేతుల్లో పెట్టొద్దు- కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పవర్ ఎక్స్ పో – 2026’ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను ఆమె పరిశీలించారు. విద్యుత్ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక ఆవిష్కరణలు, అధునాతన పరికరాల పనితీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

* అదానీ చేతుల్లోకి మన విద్యుత్ రంగం..
రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లను నిర్బంధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. “సెల్ ఫోన్ తరహాలో ముందే రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ సరఫరా చేస్తామనడం అత్యంత దారుణం. పేద, మధ్య తరగతి ప్రజలపై ఇది మోయలేని ఆర్థిక భారంగా మారుతుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ స్మార్ట్ మీటర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న ఆమె, “రాష్ట్రంలో పేదలకు అందుతున్న ఉచిత విద్యుత్ పథకాలను మెల్లమెల్లగా ఎత్తివేసేందుకే ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తోంది. తెలంగాణ ప్రజల విద్యుత్ భవిష్యత్తును అదానీ వంటి బడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని చూడటం సరికాదు” అని మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక విధానాలను పక్కనబెట్టి, ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
