Kamalapur SSC Results Pass
* 98 శాతానికి పై మార్కులతో బాలురు, బాలికల సమాన ప్రతిభ
* అభినందించిన మండల విద్యాశాఖాధికారి కె. శ్రీధర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల వ్యాప్తంగా పదో తరగతి లో 98.82% ఉత్తీర్ణత నమోదయింది. మండల విద్యాధికారి కె. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం ఉత్తీర్ణతతో పోలిస్తే, ఈ ఏడాది మండలంలోని మెజారిటీ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. మండల వ్యాప్తంగా మొత్తం 593 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 586 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలురు 98.85%, బాలికలు 98.78% ఉత్తీర్ణత సాధించి, ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా దాదాపు సమానమైన ప్రతిభను కనబర్చడం విశేషం. మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థి పాఠశాల బిట్ల భరత్ 576 మార్కులతో మండల టాపర్ గా, మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల విద్యార్థిని జి. మధు ప్రియ, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాల విద్యార్థి వి. కృతిక్ ఇద్దరు 573 మార్కులతో రెండవ స్థానములో, కాకతీయ మర్రిపల్లిగూడెం పాఠశాల విద్యార్థి వంగ రోహిత్ 572 మార్కులతో మూడవ స్థానములో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి కమలాపూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మొగిలిచెర్ల అశ్విత 549 మార్కులతో మొదటి స్థానములో నిలిచినట్లు మండల విద్యాధికారి తెలిపారు మండల వ్యాప్తంగా ఉన్న 22 పాఠశాలల్లో… లోకల్ బాడీ ప్రభుత్వ పాఠశాలలు 14 ఉండగా అందులో 08 పాఠశాలలు, 04 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 03 పాఠశాలలు, 04 ప్రైవేట్ పాఠశాలల్లో 03 పాఠశాలలు 100 % ఉత్తీర్ణత సాధించాయని మండల విద్యాధికారి తెలిపారు.
రాష్ట్ర సగటును మించి నమోదైన ఉత్తీర్ణత పట్ల , మండల విద్యాధికారి కె. శ్రీధర్ అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను, 100 % ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాల ప్రధానోపాద్యాయులను అభినందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
