* పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం
* మేడారం జాతరకు ప్రభుత్వం తరఫున కేసీఆర్ కు ఆహ్వానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాగున్నరా.. అమ్మ.. అంటూ తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. సాదరంగా ఆహ్వానించారు. పసుపు, కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయబద్ధంగా సత్కరించారు. రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల, మంత్రి దనసరి సీతక్క ఎర్రవెల్లి నివాసంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా ప్రభుత్వం తరఫున ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కు మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా… తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరంమంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కేసీఆర్ వెంట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
