* ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ
* సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హిందువుల ప్రముఖు పుణ్యక్షేత్రంగా భావించే కేదార్నాథ్ ఆలయ తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య.. ఆలయ తలుపులు తెరవనున్నట్లు శ్రీ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా పూలతో అలంకరిస్తున్నారు. తీవ్ర మంచు కారణంగా, అక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటా శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయానికి ప్రత్యేక విశిష్ఠత ఉంది.
సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో..
మహా శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించాలని ప్రతీ హిందువు కోరుకుంటారు. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర చాలా సాహసోపేతమైనది. అయినప్పటికీ ఆ యాత్ర చేపట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని కేదార్నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిమాలయాల సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో అత్యంత చలి వాతావరణ ఉంటుండడంతో అక్షయతృతీయ నుంచి దీపావళి వరకు మాత్రమే భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఆలయానికి చేరడానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు, కాలినడకన యాత్ర సాగిస్తారు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు శివభక్తులు విశ్వసిస్తున్నారు. చార్‌ధామ్‌లుగా వ్యవహరించే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాధ్ లలో ఇది ఒకటి.
శివలింగంలేని జ్యోతిర్లింగక్షేత్రం
జ్యోతిర్లింగాల్లో ప్రముఖ క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో శివలింగం ఉండకపోవడం గమనార్హం. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. పురాణాల్లో దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదట. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తు పట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడట. మరో వైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు. ఒక్కో ఆవు/ఎద్దు భీముడి కాలు కింది నుంచి బయటకు వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. చాలా మందిని చంపి పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడక, భీముడి కాళ్ల కింది నుంచి వెళ్లలేడు కనుక.. మంచులోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తాడట. పాండవులు అది గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది. అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్ లో కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్ నాథ్ లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి ఖాట్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు.
——————————–