* డ్యామ్ కూలిన ఘటనలో 45 మందికి పైగానే..
* కెన్యాను కుదిపేస్తున్న భారీ వర్షాలు
* కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : కెన్యాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. వారం రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందినట్లు అధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే.. రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌లో నీటి ప్రవాహం పెరిగి గోడలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దిగువ ప్రాంతాల్లోకి నీరు ప్రవహించింది. పలు ఇళ్లు, ఒక ప్రధాన రహదారి ధ్వంసమైంది. వరదల్లో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. “డ్యామ్ ధ్వంసం కావడం వల్ల 45 మంది వరకు మృతి చెందారు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇంకా పలువురు బురదలో చిక్కుకొని ఉన్నారు. వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి” అని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. కాగా.. భారీ వర్షాలకు ఇప్పటికే ఈ దేశంలో మరణాలు సంభవిస్తుండగా, డ్యామ్ ఘటనతో ఆ సంఖ్య 120కి చేరింది. ఎల్‌నినో వల్లే సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికే పాఠశాలలకు ఇచ్చిన మధ్యంతర సెలవుల్ని పొడిగించాల్సి వచ్చింది. ఇదిలాఉంటే.. పొరుగుదేశం టాంజానియాలో కూడా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో వరదలు, కొండచరియలు కారణంగా అక్కడ 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
—————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
