Jubilee Hills hit run
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన 2022 జుబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కుమారుడు మహ్మద్ రాహిల్ అమీర్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆయన జుబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు.
*అతివేగం వల్లే ఈ ప్రమాదం*
2022 మార్చి 17న జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ పసికందు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం, రాహిల్ అమీర్ కారు నడుపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
*విదేశాల నుండి రాగానే పోలీసులకు చిక్కిన రాహిల్*
ప్రమాదం జరిగిన సమయంలో రాహిల్‌ను కాపాడేందుకు మరొక వ్యక్తిని డ్రైవర్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని విమర్శలు వచ్చాయి. అయితే, హైకోర్టు జోక్యంతో పోలీసులు ఈ పాత కేసును తిరిగి తెరిచారు. అప్పటి నుండి రాహిల్ పరారీలో ఉండటంతో పోలీసులు ‘లుక్ అవుట్ సర్క్యులర్’ (LOC) కూడా జారీ చేశారు. ఇటీవల విదేశాల నుండి హైదరాబాద్ చేరుకున్న రాహిల్‌ను ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
*షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు*
పోలీసుల ఎదుట లొంగిపోయిన అనంతరం రాహిల్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రధాన నిందితుడు లొంగిపోవడంతో ఈ కేసులో తదుపరి విచారణ వేగవంతం కానుంది.
