
ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం అత్తను, ఆస్తి కోసం తల్లి, తోబుట్టువుల హత్య.
* ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని అత్తను..
* మరో ఘటనలో ఆస్తి కోసం తల్లి, తోబుట్టువుల హత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్: డబ్బు కోసం దారుణాలు పెరుగుతున్నాయి. మానవ సంబంధాలను మరిచిపోతున్నారు. రక్తబంధాన్ని కూడా తెంచేస్తున్నారు. అత్తను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని.. ఓ కోడలు పథకం వేసింది. ఆమెను దారుణంగా కొట్టించింది. మరో ఘటనలో ఆస్తి కోసం ఏకంగా తల్లిని, తోబుట్టువులను చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లో డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే దాడి చేయించిందో మహిళ. అత్తను చంపేస్తే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. తన తరుఫు బంధువులతో కొట్టించిన ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టెలమండి సమీపంలో భర్త, అత్తపై బంధువులతో భార్య దాడి చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు చూస్తుండగానే.. కత్తులు, కర్రలతో నిందితులు విచక్షణరహితంగా దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఆస్తి కోసం ఘాతుకం
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో మరో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు తోబుట్టువులను హత్య చేశాడు. ఆస్తి కోసం తల్లి పిచ్చెమ్మతో పాటు ఆమెతో ఉంటున్న ఇద్దరు కూతుళ్లు నీరజ, ఝాన్సీని ఇంట్లోనే దారుణంగా నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక ఇబ్బందులతోనే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్వర్లు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
————