Konda Couple Meeting
కొండా దంపతుల కీలక భేటీ..
* భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్
* బర్తరఫ్ తర్వాత తొలిసారి కార్యకర్తలతో సమావేశం
* రాజకీయాల్లో తమ ప్రయాణంపై కొండా మురళి కీలక వ్యాఖ్యలు
* కృతజ్ఞత చూపడం మా రక్తంలోనే ఉంది – కొండా మురళి
ఆకేరు న్యూస్ వరంగల్ : మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కీలక సమావేశం నిర్వహించారు. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారిగా వరంగల్ జిల్లాకు చెందిన కార్యకర్తలు, అనుచరులతో వరంగల్ లోని ఏంకే నాయుడు గార్డెన్ లో కొండా దంపతులు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్ కార్యాచరణ, అనుచరులు–కార్యకర్తలతో కలిసి ముందుకు వెళ్లే అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
మొదట కొండా దంపతుల నివాసంలో జరగాల్సిన సమావేశాన్ని వర్షం కారణంగా హోటల్‌కు మార్చారు. ఈ సమావేశానికి వరంగల్ జిల్లాలోని కొండా కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకులు, కార్యకర్తలు, అనుచరులు హాజరయ్యారు. సురేఖ మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశంలో కొండా మురళి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఈటీవీ తెలంగాణ ప్రసారం చేసిన దృశ్యాల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీని వీడి వేరే రాజకీయ పార్టీలోకి వెళ్లే ఆలోచన తమకు లేదన్న సంకేతాలు ఇచ్చారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే కొండా సురేఖతో కలిసి పనిచేసినందుకు తాను సంతోషంగా ఉన్నానని మురళి పేర్కొన్నారు. సురేఖ రాజకీయ ప్రయాణంలో కార్యకర్తలు, అనుచరులు అందించిన సహకారాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కొండా సురేఖను గెలిపించడంలో స్థానికంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తల పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొండా కుటుంబం రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతోందన్న చర్చ జరుగుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది. కొండా వర్గం భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోవడంతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కొండా దంపతులు తమ అనుచరులతో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కార్యకర్తలతో చర్చల అనంతరం కొండా కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
* కృతజ్ఞత చూపడం మా రక్తంలోనే ఉంది : కొండా మురళి
కృతజ్ఞత చూపడం తమ కుటుంబానికి చిన్ననాటి నుంచే అలవాటని కొండా మురళి అన్నారు. తమకు అండగా నిలిచిన కార్యకర్తలు, అనుచరులను ఎప్పటికీ మరిచిపోమని తెలిపారు. కష్టకాలంలో తమ వెంట నిలిచిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, వారి కోసం ఎప్పుడూ ముందుంటామని కొండా మురళి స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
