CM Revanth Reddy Arya Vaishya
* ఆర్యవైశ్య సభలో సీఎం రేవంత్ భావోద్వేగ వ్యాఖ్యలు
* గాంధీ నుంచి రోశయ్య వరకు..
* దేశ నిర్మాణంలో ఆర్యవైశ్యుల పాత్ర అనన్యసామాన్యం
* రాజకీయాల్లో ఐక్యతే ఆర్యవైశ్యుల బలం..
* తెలంగాణ సీఎం పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆర్యవైశ్య సామాజిక వర్గం దేశాభివృద్ధికి, ఆర్థిక రంగానికి అందించిన సేవలు అసాధారణమైనవని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూటికి నూరు శాతం ఆర్థిక సహాయం అందిస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చారు.
* రోశయ్యతో నా అనుబంధం మరువలేనిది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొనిజేటి రోశయ్యను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. “నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో నా ప్రతిభను, హోమ్వర్క్ను గుర్తించి ప్రోత్సహించిన తొలి పెద్దమనిషి రోశయ్య గారే. ‘కొంచెం ఆవేశం తగ్గించుకొని అనుభవాన్ని తోడు చేసి మాట్లాడితే జీవితంలో పైకి వస్తావు, తిరుగులేని నాయకుడివి అవుతావు’ అని నన్ను ఆశీర్వదించారు. అసెంబ్లీలో ఆయన వేసే చురకలు అగరబత్తి సువాసనలా ఉండేవి తప్ప ఎప్పుడూ ద్వేషపూరితంగా ఉండేవి కావు” అని సీఎం పేర్కొన్నారు. రోశయ్య హైదరాబాద్ పట్ల చూపిన మమకారాన్ని గౌరవిస్తూనే, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి నగరం నడిబొడ్డున స్థలం కేటాయించి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని సీఎం స్పష్టం చేశారు.
* ప్రపంచం గర్వించే నాయకుడు మహాత్మా..
ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తిని చాటిచెప్పిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ అని, ఆయన ఆర్యవైశ్యుల బిడ్డ కావడం ఆ సామాజిక వర్గానికే కాకుండా మొత్తం దేశానికే గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా స్వాతంత్య్ర పోరాటం, రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు, కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి, కేంద్ర మాజీ మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య వంటి మహనీయుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
* పేద ఆర్యవైశ్యులకు ఆసరాగా ఆత్మగౌరవ భవనం..
“ఆర్యవైశ్యులు ఆర్భాటాలకు, ప్రచారాలకు దూరంగా ఉండటం వల్లే రావాల్సినంత గుర్తింపు రావడం లేదని భావిస్తున్నాను. ఈ ఆత్మగౌరవ భవనం కేవలం ఆస్తిపరులకే కాకుండా, ఆత్మాభిమానం చంపుకోలేక మనసులోనే బాధపడుతున్న పేద ఆర్యవైశ్య కుటుంబాలకు సంపూర్ణంగా ఉపయోగపడాలి” అని సీఎం ఆకాంక్షించారు.
* రాజకీయాల్లో ఐక్యతే శ్రీరామరక్ష..
పోటీ ప్రపంచంలో ఆర్యవైశ్యులు పొలిటికల్ కోటాను సాధించుకోవాలంటే ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. “మీరు కలిసికట్టుగా ఉన్నప్పుడే మీ బలం వ్యక్తమవుతుంది. చిన్న చిన్న విభేదాలు ఏవైనా ఉంటే సమన్వయం చేసుకోవాలి. కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్గా ఆర్యవైశ్య బిడ్డకే అవకాశం ఇచ్చాం. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో, కార్పొరేషన్లలో ప్రభుత్వ భాగస్వామ్యం తగిన రీతిలో ఉంటుంది” అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎటువంటి షూరిటీ లేకుండా అప్పు దొరుకుతోందంటే దానికి ఆర్యవైశ్యుల ఉనికి, నమ్మకమే కారణమని, వారే ఆర్థిక సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
