TF TDA Forgery Case
* బ్యాంకులకు నకిలీ పత్రాలు..
* కోర్టు సంచలన ఆదేశాలు
* సుమలత కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ (TF TDA)లో కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదాలు సంచలన మలుపులు తిరుగుతున్నాయి. యూనియన్ ఆర్థిక లావాదేవీలు, నకిలీ పత్రాల వ్యవహారంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీవ్ర స్థాయిలో స్పందించారు. సంస్థకు చెందిన కొందరు సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
అసోసియేషన్లోని కొందరు వ్యక్తులు యాజమాన్యం ప్రమేయం లేకుండా బ్యాంకులకు ఫోర్జరీ లేఖలు సమర్పించారని సుమలత వెల్లడించారు. ఈ నకిలీ పత్రాలు, చట్టవిరుద్ధమైన బ్యాంకు లావాదేవీలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సమగ్ర విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆమె స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు, పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు సుమలత తెలిపారు. వర్కింగ్ పర్మిట్లు, సభ్యత్వాల విషయంలో లేబర్ కమిషన్ సైతం స్పష్టత ఇచ్చిందని, అవసరమైతే కొత్త డాన్సర్లను అసోసియేషన్లోకి తీసుకోవచ్చని కమిషన్ సూచించినట్లు పేర్కొన్నారు.
అసోసియేషన్లో తలెత్తిన విభేదాలు, వివాదాలన్నీ రాబోయే కొద్ది రోజుల్లో పూర్తిగా సద్దుమణుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యులందరి సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా సుమలత స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
