Konda Surekha Dismissal
* తన వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించిన సుస్మిత
* కొండా దంపతులకు చుట్టుకున్న వివాదం
* ఊడిన సురేఖ మంత్రి పదవి
* కాంగ్రెస్‌లోనూ వారి భవితవ్యం ప్రశ్నార్థకం
ఆకేరు న్యూస్, వరంగల్: కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్‌రెడ్డి, మరికొందరిపై చేసిన వ్యాఖ్యలు ఇంత వివాదాన్ని సృష్టిస్తాయని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యులను చేయొద్దని కొండా సురేఖ అధిష్ఠానానికి చెప్పినా ఆమె మొర ఎవరూ ఆలకించలేదు. సుస్మిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇంత ఉపద్రవం ముంచుకొస్తుందని ఆమె ఊహించి ఉండదు. పార్టీపై పట్టు నిలుపుకోవడానికే సీఎం రేవంత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. పార్టీ లైన్ ఎవరు దాటినా వేటు తప్పదని హెచ్చరించడానికే ఈ కఠిన నిర్ణయం కాంగ్రెస్ తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కొండ దంపతులకు గట్టి పట్టు ఉంది. స్వయం కృషితో ఎదిగిన కొండా దంపతులు స్వతంత్రంగానే ఉండిపోతారా ? మరో పార్టీలో చేరతారా ? తేలాల్సి ఉంది. అధిష్ఠానం మంత్రి నుంచే బర్తరఫ్ చేశారు. మరి సురేఖ ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతారా ? అవమానకరంగా తొలగించినందుకు ఆవేదనతో పార్టీకీ రాజీనామా చేస్తారా ? తనను ఒంటరి చేసి వేటు వేశారనే భావనలో ఉన్న సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
* కొండా సురేఖపై వేటు..కీలక పరిణామం
కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోదం లభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని గవర్నర్‌కు సిఫారసు లేఖ పంపినట్లు వార్తలు వచ్చాయి. కొండా సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు అంగీకరించకపోవడంతో బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
* వివాదం ఎలా మొదలైంది?
కొండా సురేఖ కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జరిగిన విమర్శలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు గత వారం నివేదికలు వెలువడ్డాయి. అనంతరం ఈ అంశం ఢిల్లీ స్థాయికి చేరింది. కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై చర్చించినట్లు, పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
* రాజీనామాకు నిరాకరణ..
తాజా పరిణామాలకు ముందు కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే అవకాశం ఉందంటూ అప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగింది.
* తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సవాల్
కొండా సురేఖపై చర్యతో తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ విషయంలో అధిష్ఠానం కఠిన సంకేతాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డిని కూడా తొలగించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
తనకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారని, కనీసం తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని సురేఖ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తానేమి నిర్ణయించుకోలేదని, తన భర్త మురళితో చర్చించి నిర్ణయం తీసకుంటామని అన్నారు. తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
